ప్రజా గాయకుడు పందిరి రాముకి సిపిఎం సంతాపం

ప్రజాశక్తి-విశాఖ: ప్రజా గాయకుడు, రచయిత, ప్రజా కళాకారుడు పందిరి రాము అకాలమరణం సిపిఎం, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు కొనియాడారు. మధురవాడ శివశక్తినగర్‌లో పందిరి రాము తన ఇంటి వద్ద బుధవారం రాత్రి 12 గంటల సమయంలో అకాలమరణం పొందారు. ఆయన మరణవార్త తెలిసివెంటనే సిపిఎం నాయకులు, శ్రేణులు, పలు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాము ప్రజా ఉద్యమాలకు ఒక శక్తి అని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి విశాఖపట్టణానికి వలస వచ్చి మాధవధారలో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసేవాడని, అక్కడ స్థానిక సిఐటియు సంఘంలో చేరి సిపిఎంకి ఆకర్షితుడై పార్టీ సభ్యునిగా చేరి ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకింతం చేసారన్నారు. రాముకి చదువులేకపోయినప్పటికీ పాటలు, పౌరానిక పద్యాలు, నాటకాలు ప్రదర్శించి కార్మికులను, ప్రజలను చైతన్యవంతం చేసేవారని గుర్తుచేసారు. మధురవాడ జాతరలోగాని, గ్రామీణ ప్రాంతంలో పండుగలకు వెళ్ళినప్పుడు సైతం ఆయన పాట లేకుండా ఉండేది కాదన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుడుగా నగరానికి పచియమైన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్రాసిన ప్రజా ఉద్యమపాటలు అనేకం మంచి ఉత్సాహాన్నిచ్చాయన్నారు. ఎక్కడ భూపోరాటాలు జరిగినా ఆయన ప్రజానాట్యమండలి కళాకారుడుగా ముందుండి పాటలు పాడేవారన్నారు. ఆయన మరణం ప్రజాఉద్యమాలకు, వారి కుటుంబానికి తీరని లోటన్నారు. ఆయన సంస్మరణ సభలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యమ సందర్భంలోనూ, సమావేశాల సమయంలో నిర్వహించాలని జగ్గునాయుడు పిలుపునిచ్చారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ఆయన భౌతికాకాయాన్ని సందర్శించిన వారిలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, స్థానిక నాయకులు డి.అప్పలరాజు, పి.రాజుకుమార్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పద్మ, కంచరపాలెం జోన్‌ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, పి.ఎన్‌.ఎం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణ, ఎం.చంటి, కెవిపిఎస్‌ నాయకులు ఎస్‌.పైడితల్లి, సిఐటియు నాయకులు డి.కొండమ్మ, ఒ.అప్పారావు, బి.సింహాచలం, ఐద్వా నాయకులు బి.భారతి, సుజాత, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యు.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రాజు, విసిసి మధురవాడ జోన్‌ కన్వీనర్‌ పుష్ప, మున్సిపల్‌ సిఐటియు నాయకులు శేషు, కిరణ్‌, శ్రావణ్‌కుమార్‌, స్థానిక సిపిఎం, సిఐటియు నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళర్పించారు.

➡️