మోడీ మహామోసం.. విశాఖ పర్యటనపై సిపిఎం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీలుపై రాష్ట్రప్రజల మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా మరోసారి మోసం చేశారని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్రప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మోడీ తన సుదీర్ఘ ప్రసంగంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల గురించి గొప్పగా చెప్పారే తప్ప పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా గురించి ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజి వంటి విభజన హామీల గురించి మాట్లాడకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది రాష్ట్రప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును కాపాడి తీరుతామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు కూడా తమ ప్రసంగాల్లో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పకపోవడం వారి చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచి ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ గురించి చంద్రబాబు విన్నపాలు చేశారే తప్ప విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పకపోవడం దారుణమని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం రద్దు, స్వంత గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనం సమస్యలపై ప్రధాని ప్రకటన చేస్తారని, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ప్రధానితో ప్రకటన చేయిస్తారని స్టీల్‌ కార్మికులు, విశాఖ ప్రజలు ఎదురుచూశారని తెలిపారు. కానీ వీరు ప్రజల ఆశలను వమ్ము చేశారని, ఇది దుర్మార్గ చర్య అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాలుగేళ్లకు పైగా పట్టుదలగా పోరాడుతున్న విశాఖ ఉక్కు కార్మికులు, వారికి సంఘీభావంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రజలు మరింత బలమైన ఉద్యమం సాగిస్తేనే పాలకుల మెడలు వంచడం సాధ్యమవుతుందని తెలిపారు.

➡️