- జనాభా ప్రాతిపదికన గిరిజన ప్రాంతానికి నిధులు కేటాయించాలి
- ప్రభుత్వ విధానాలతో జిసిసి నిర్వీర్యం : ఎస్.పుణ్యవతి
- సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా మహాసభ ప్రారంభం, బహిరంగ సభ
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి అన్నారు. ఇందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరగనున్న సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా 10వ మహాసభ కురుపాంలో మంగళవారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రావాడ జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను పూర్తిగా విస్మరించారన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని, ప్రజలపై భారాలు మోపుతున్నారని వివరించారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధులు కేటాయింపులోనూ, ఖర్చులోనూ కేంద్రం వివక్ష చూపుతోందని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. నాడు గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పించేందుకు జిసిసిని ఏర్పాటు చేయగా, బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ సంస్థను నిర్వీర్యం చేసిందని తెలిపారు. గిరిజన ఆవాసాలను పక్కనపెట్టి, కార్పొరేట్ శక్తులు ఖనిజ సంపదను దోచుకునేందుకు వీలుగా అటవీ ప్రాంతంలో సైతం అధిక నిధులతో భారీ రోడ్లు వేస్తున్నారన్నారు. జీడి, పామాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా మనదేశంలోని రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అభివృద్ధి ముసుగులో మతోన్మాదం : బి.తులసీదాస్
అభివృద్ధి ముసుగులో బిజెపి, సంఘపరివార్ శక్తులు మతోన్మాదాన్ని నింపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ అన్నారు. మతం పేరిట ప్రజలను విభజించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలను గుర్తెరిగి మత విద్వేషాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చే నెల ఐదున విజయవాడలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు మతం ప్రాతిపదికన సభలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజల అభీష్టం మేరకు వారి మత సంప్రదాయాలు ఆచరించుకునేందుకు పాలకులు స్వేచ్చ ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకున్నారన్నారు. భర్త చనిపోతే భార్యని సతీసహగమనం పేరిట చంపేయాలని సనాతన ధర్మం సూచిస్తోందన్నారు. ఇలాంటి ధర్మాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రచారం చేయడం తగదన్నారు.
ప్రజల పేరిట అప్పులు చేసి కార్పొరేట్లకు ధారాదత్తం : కె.సుబ్బరావమ్మ
ప్రజల పేరిట రూ.వేల కోట్లు అప్పులు చేసి అదాని తదితర కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ విమర్శించారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్ల పాలనలో రూ.55 వేల కోట్లు అప్పు చేస్తే, బిజెపి పదేళ్ల పాలనలో రూ.110 వేల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. అప్పుగా తీసుకొచ్చిన మొత్తాన్ని ఏయే ప్రాంతాల్లో ఏయే వర్గాలకు ఎంతెంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం ఆచరణలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ నిరుద్యోగాన్ని సృష్టిస్తోందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్, పార్టీ సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన వహించారు. బహిరంగ సభకు ముందు కురుపాం పాత బస్టాండ్ నుంచి రావాడ జంక్షన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనకు ముందు భాగంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు కమ్యూనిస్టుల క్రమశిక్షణకు అద్దం పట్టింది. కొందరు గిరిజన యువకులు విల్లంబులు చేతబూని గిరిజన సంప్రదాయ వేటను, అడవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అనంతరం సీతారాం ఏచూరి నగర్‌లోని బుద్ధదేవ్ భట్టాచార్య ప్రాంగణంలో రుద్రరాజు సత్యనారాయణరాజు వేదికపై (సాయినందకి కల్యాణ మండపంలో) మహాసభ ప్రారంభమైంది.