భూముల లీజు కాదు.. కార్పొరేట్ల కబ్జా

  • విద్యుత్‌ ఒప్పందాలపై వి. శ్రీనివాసరావు
  • రైతులకు, వినియోగదారులకు హానికరం
  • ‘పెంటగాన్‌’ అగ్రిమెంట్‌ వివరాల వెల్లడి
  • కోట్లలో ఆదాయం…వేలల్లో విదిలింపు
  • ఎకరాకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులతో కార్పొరేట్‌ కంపెనీలు చేసుకుంటున్న విద్యుత్‌ ఒప్పందాలు హానికరమని, రైతులు భూములపై హక్కు కోల్పోతారని, విద్యుత్‌ వినియోగదారులపై భారం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం బాలోత్సవ భవనంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాల్లో పెంటగాన్‌ సినర్జీ సొల్యూషన్స్‌ కంపెనీ రైతులతో చేసుకున్న ఒప్పందపత్రంలో వివరాలను ఆయన వెల్లడించారు. అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం రైతులు భూములపై హక్కు శాశ్వతంగా కోల్పోతారని, 30 సంవత్సరాల పాటు రైతులు వాటిని బిడ్డలకు ఇవ్వలేరని, రుణం తీసుకోలేరని, అటవీ, గిరిజన చట్టాలు వర్తించవని, కంపెనీదే తుది నిర్ణయం అవుతుందని అన్నారు. రైతుల నుండి లీజు పేరుతో తీసుకునే ప్రతి రెండున్నర లేదా మూడు ఎకరాల్లో మెగావాట్‌ కరెంట్‌ సోలార్‌ ద్వారా తయారవుతుందని, అదే భూమిలో మరో మెగావాట్‌ కరెంట్‌ గాలి ద్వారా కూడా ఉత్పత్తి చేసుకోవచ్చని అంటే రెండు మెగావాట్ల కరెంట్‌ తయారైతే సగటున సంవత్సరానికి దాదాపు 50 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. ఎకరాకి 20 కోట్లు వస్తే రైతులకు రూ.30 వేలు మాత్రమే ఇస్తారని, ఇంతకన్నా నిలువుదోపిడీ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ఒప్పందాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎమీ మాట్లాడడం లేదని,కార్పొరేట్‌ కంపెనీలు రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు కాపలా కాస్తుందా అని ప్రశ్నించారు. మోడీ ఆదేశంపై జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన విధానాన్నే చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. కంపెనీ మూడు ఎకరాలకు 15 కోట్ల నుండి 20 కోట్లు పెట్టుబడి పెడుతుందని, సంవత్సరానికి 15 లక్షల నుండి 20 లక్షలు మాత్రమే ఖర్చవుతుందని, ఈ లెక్కన ఐదారేళ్లలో వారి మొత్తం పెట్టుబడి తిరిగి వస్తుందని, ఆ తర్వాత అంతావారికి 100 శాతం లాభమేనని వెల్లడించారు. వినియోగదారుల నుండి ప్రతి యూనిట్‌కు రూ.2.49 పైసలు 25 సంవత్సరాలపాటు వసూలు చేస్తారని అన్నారు. జనంపై లక్ష 20 వేల కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. అటు రైతులను, ఇటు వినియోగదారులను నిలువునా ముంచుతున్నారని, ఈ చట్ట వ్యతిరేక, అక్రమ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కౌలురైతులు భూ యజమానుల నుండి భూమి కౌలుకు తీసుకుంటే 11 నెలలకే ఉండే విధంగా చట్టం చేశారని, అదే సోలార్‌ పవర్‌కు కార్పొరేట్‌ కంపెనీలు 30 సంవత్సరాలు ఒప్పందాలు ఒకేసారి ఎలా చేసుకుంటాయని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం లీజు రెన్యూవల్‌ చేయాలని, ఎకరాకు నెలకు రూ. 30 వేలు లీజు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు కూడా ప్రతి సంవత్సరం పరిహారం చెల్లించాలని కోరారు.

అమెరికాకు దేశాన్ని తాకట్టు పెట్టిన మోడీ

అమెరికా పర్యటనకు ముందు అదానీ కేసు విచారణ జరగకుండా ట్రంప్‌ చేత చట్టసవరణ చేయించి గిఫ్ట్‌ పొందిన మోడీ రిటన్‌ గిఫ్ట్‌ కింద ఎఫ్‌-35 విమానాలు, ఆయిల్‌, గ్యాస్‌ అమెరికా నుండి కొనుగోలు చేసి వారికి లబ్ది చేకూరుస్తున్నారని, దీనివల్ల అమెరికా వాణిజ్యలోటు తగ్గుతుందని, మన దేశంపై భారం పడుతుందని శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే తక్కువ రేటుకి రూపాయిల్లో రష్యా, ఇరాన్‌ నుండి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తున్నామని, ఇప్పుడు దాన్ని ఆపి అమెరికా నుండి కొనుగోలు చేయడం నష్టమని పేర్కొన్నారు. ఎఫ్‌-35 యుద్ధ విమానాలకు కాలం చెల్లిందని ఏడాది క్రితమే మస్క్‌ చెప్పారని వాటిని ఎలా కొనుగోలు చేస్తామని ప్రశ్నించారు. కాలం చెల్లిన ఆయుధాలు కొని అమెరికాకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని అన్నారు. మరోవైపు అదే అమెరికా మన దేశ పౌరులకు వీసాల్లేవని బేడీలు వేసి అవమానంగా విమానాల్లో పంపిస్తుంటే నోరు మెదపడం లేదని, ఇది భారతీయ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమేనని అన్నారు. అమెరికా ఎంబసీకి నిరసన తెలపాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు దూరంగా ఉండాలి

ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను టీచర్లు, విద్యావంతులకు వదిలేయాలని శ్రీనివాసరావు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయకుండా పిడిఎఫ్‌ను బలపరుస్తున్నదంటున్నారని ఒక విలేకరి ప్రస్తావించగా వైసిపి పోటీ చేయకపోవడం మంచిదేనని, అదే విధంగా టిడిపి కూటమి కూడా పోటీ చేయకుండా ఉండాల్సిందని అన్నారు. విద్యావంతుల, టీచర్ల హక్కును హైజాక్‌ చేయొద్దని శాసనమండలిలో వారి గొంతు వినపడకుండా చేయడానికే టిడిపి పోటీ చేస్తున్నదని, పిడిఎఫ్‌ టీచర్లు, విద్యావంతుల తరపున నిలబడుతున్నదని చెప్పారు.

సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటాం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశంపై మాట్లాడుతూ వారిని తొలగించినా, వేధించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వలంటీర్లకు జీతం రూ.10 వేలు ఇస్తామని వాగ్దానం చేసిన టిడిపి ఇప్పుడు ఏకంగా వారిని తొలగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పి మోసం చేయడం సరికాదన్నారు.

ప్రజల అప్పు ఎవరు తీరుస్తారు?

ప్రభుత్వం అప్పుల్లో ఉందని, సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చంద్రబాబు అంటున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా ప్రజలు అప్పుల్లో ఉన్నారని వాటిని ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం కనిపించడం లేదా అన్నారు. ప్రజలపై భారం వేస్తే ప్రతిఘటిస్తామన్నారు.

రానున్న బడ్జెట్‌లో కేటాయింపులు చూశాక విద్యుత్‌ చార్జీల తగ్గింపు కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు ఉపసంహరించుకోవాలని, అదానీకోసం జరిగిన సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు అదానీ ఒప్పందాలు రద్దు చేసుకున్నాయని తాజాగా శ్రీలంక అదానీ ఒప్పందాన్ని సమీక్షించడంతో అదానీ కంపెనీ వెనక్కి వచ్చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నదని ప్రశ్నించారు. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు పెట్టడం లేదంటూనే షిర్డిసాయి కంపెనీకి నిర్వహణ ఖర్చులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

పవన్‌కళ్యాణ్‌ గుడుల దర్శనంపై స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగత కార్యక్రమమని, కానీ మతం పేరుతో విద్వేషాలు పెంచడాన్ని శ్రీనివాసరావు వ్యతిరేకించారు. పవన్‌ చర్యలు, మాటలు ఆర్‌ఎస్‌ఎస్‌కు తోడ్పడుతున్నాయని, మత సామరస్యానికి భంగమని అన్నారు. చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్‌పై దాడి జరిగితే సిపిఎం స్పందించి ఆయన్ను కలిసి సంఘీబావం తెలిపిందని, కానీ పవన్‌ వెళ్లి ఎందుకు మద్దతు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆయనకు హిదూ మతంపై కన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద సిద్దాంతంపై విశ్వాసమని విమర్శించారు.

➡️