ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ బీచ్‌లోని హార్బర్ పార్కు స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం సంబంధిత స్థలం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జివిఎంసిలో సిపిఎం ఫ్లోర్ లీడర్ బి.గంగారావు మాట్లాడుతూ.. లులూ మాల్‌కు స్థల కేటాయింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంస్థకు 2017లో నాటి టిడిపి ప్రభుత్వం 13.83 ఎకరాల స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేయించిందన్నారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ స్థల కేటాయింపును ఉపసంహరిస్తూ జిఒ విడుదల చేసిందని తెలిపారు. నేడు టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆఘమేఘాలపై లులూ మాల్‌కు స్థల కేటాయింపునకు సంబంధించి జిఒను విడుదల చేయడాన్ని సిపిఎం ఖండిస్తోందన్నారు. సముద్రతీర ప్రాంతంలో సిఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ మాల్ వస్తే 15 వేల ఉద్యోగాలు వస్తాయని బూటకపు ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించి కారుచౌకగా ప్రభుత్వ స్థలాలను టెక్ మహీంద్ర, విప్రో, సిఎంఆర్ సెంట్రల్ వంటి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని గుర్తు చేశారు. అందులో భద్రత లేని ఉద్యోగాలు, తక్కువ జీతాలు ఇచ్చి శ్రమను దోచుకుంటున్నారన్నారు. ఇప్పుడు లులూ మాల్‌లో ఏడు అంతస్తులతో 20 షాపింగ్ మాల్స్, ఎనిమిది థియేటర్లు, చిల్డ్రన్స్ పార్కు, హైపర్ మార్కెట్ వంటివి నిర్మిస్తున్నట్లు సంస్థ తెలిపిందని, దీని విలువ రూ.1500 కోట్లు అని చెప్పారని తెలిపారు. 99 ఏళ్లకు లీజుకిచ్చి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి పూనుకోవడమంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సిన ట్యాక్స్‌లను మినహాయించనున్నారని తెలిపారు. ఈ మాల్ వస్తే తీరంలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి ప్రతిదానికీ రుసుములు చెల్లించాల్సి వస్తుందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ.. లులూ మాల్ వస్తే చిరు వ్యాపారులు, హోటళ్లు, సినిమా హాళ్లు, టెక్స్‌టైల్స్ వ్యాపారులు నష్టపోతారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.సుబ్బారావు, వి.నరేంద్ర కుమార్, జివిఎన్.చలపతి, పి.వెంకటరావు, కె.కుమారి, కె.చంద్రశేఖర్, ఎం.చంటి, వై.రాజు పాల్గొన్నారు.
