సిపిఎం సీనియర్‌ నాయకులు రాంచంద్రరావు కన్నుమూత

Feb 22,2024 10:30 #cpm
  • నేడు అంత్యక్రియలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సిపిఎం సీనియర్‌ నాయకులు మాటూరు రాంచంద్రరావు (76) ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని తన స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్‌ నేత మంచికంటి రాంకిషన్‌ రావుకు రాంచంద్రరావు స్వయాన మేనల్లుడు. ఆయన స్ఫూర్తితోనే కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు పేటలో పుట్టిన ఆయన.. పార్టీ పిలుపు మేరకు ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. 1965లో ఆయన పార్టీ సభ్యులుగా చేరారు. ఆయన తండ్రి నాగభూషణ రావు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌) వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన రాంచంద్రరావు.. అటు తరువాత ఎస్‌ఎఫ్‌ఐగా రూపాంతరంలోను వ్యవస్థాపక నాయకులుగా ఉంటూ 1973లో సిపిఎం పూర్తి కాలం కార్యకర్తగా చేరారు. 1976 ఎమర్జెన్సీ కాలంలో, తరువాత, జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి కొరియర్‌గా పనిచేశారు. రహస్య జీవితం గడిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం ఖమ్మంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు, సిపిఎం నాయకులు ఎం. సుబ్బారావు, బాబురావు, సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్‌ వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఎస్కే మేరా సాహెబ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️