బుడమేరు ముంపు పరిష్కారానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి : సిపిఎం

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : వచ్చే బడ్జెట్‌ సమావేశంలో బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. బుడమేరు, కృష్ణానది వరద బాధితులతో కలిసి శనివారం నగరంలోని శ్రీశ్రీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. నష్టపరిహారం అందని బాధితులు వేలల్లో ఉన్నారని తెలిపారు. వరద సహాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ. ఏడు వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టినప్పుడు అందరికీ నష్టపరిహారం అందిస్తామని చెబుతున్నారని, కానీ ఆచరణలో మాత్రం సాయం అందడం లేదని అన్నారు. టిడిపి కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు ఇసుక, మద్యం వ్యవహారాల్లో బిజీగా ఉంటూ బాధితులను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా కంపెనీల వారు వరద బాధితులను మోసం చేస్తున్నారని, వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో బాధితులపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. వరద బాధితులందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ఇంటి పన్నులు, రెండు నెలలు కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యా సంస్థల ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సిటీ సెంట్రల్‌ కమిటీ కార్యదర్శి బి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.

➡️