- రెండో రోజు కొనసాగిన బైక్ యాత్రలో సిపిఎం నేతల డిమాండ్
ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా) : ఉండి నియోజకవర్గంలోని పేదల ఇళ్లను తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్ర సోమవారం రెండో రోజు సాగింది.కాళ్ల మండలంలోని వేంపాడు, బొండాడ, కాళ్ల, జువ్వలపాలెం, ఆకివీడు మండలంలోని అయిభీమవరం, దుంపగడప, ధర్మాపుర అగ్రహారం, సిద్ధాపురం, కాలింగగూడెం, కోళ్లపర్రు, గుమ్ములూరు, తరటావ గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి గోపాలన్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే పేదల ఇళ్లు కూల్చడం కాదని, కూల్చేముందు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉందని తెలిపారు. కాలుష్యానికి కారణం ఏంటి అని తెలుసుకుని, దాని నివారణా చర్యలు చేపట్టకుండా పేదల ఇళ్లు కూల్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బొండాడ గ్రామంలో రోడ్డు పక్కన పేదల ఇళ్లను తొలగించడం చూస్తే పక్షపాత వైఖరి కనబడుతోందన్నారు. రఘురామకృష్ణరాజు అభివృద్ధి పేదలకు నష్టం.. పెద్దలకు లాభం చేకూర్చేలా ఉందని వివరించారు. ఇప్పటికైనా పేదల ఇళ్లకు రక్షణ కల్పించాలని, టిడిపి కూటమి ప్రభుత్వం ఇస్తామన్న మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని, లేకుంటే పేదలకు సిపిఎం అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ యాత్రలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, దనికొండ శ్రీనివాస్, కె.తవిటినాయుడు, చీర్ల శేషు, బివి.వర్మ, చందక సూరిబాబు, ఎస్‌కె.వలీ, కిషోర్, తిరుమాని శ్రీనివాస్, గండికోట వెంకటేశ్వరరావు, తిరుమాని సుబ్బారావు, కొల్లాటి రాజు, పరిరక్షణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.