ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖ జగదాంబ సమీపంలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రూ.2029 కోట్లను గౌతం అదానీ గత ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయవ్యవస్థ బయటపెట్టిందని, ఇది అతిపెద్ద కుంభకోణమని తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ భూముల్లో ఏర్పడ్డ గంగవరం పోర్టును అదానీ ఎలా కైవశం చేసుకున్నారో వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ప్లాంట్‌కు గంగవరం పోర్టు పక్కలో బల్లెంలా ఉందన్నారు. ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయకుండా, ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి అదానీ కుట్రపన్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా స్టీల్‌ప్లాంట్ రూ.3 వేల కోట్లు నష్టపోయిందని తెలిపారు. అదానీ ఎగుమతులు, దిగుమతుల ధరలు పెంచి ప్లాంట్‌ను నష్టాల పాల్జేశారన్నారు. గంగవరం పోర్టుకు చెందిన మూడు వేల ఎకరాల్లో వెయ్యి ఎకరాల భూమి స్టీల్‌ప్లాంట్‌కు చెందినదేనని గుర్తు చేశారు. గతంలో గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 10.4 శాతం ఉండగా.. గత ప్రభుత్వం ఆఘమేఘాల మీద అప్పటి గంగవరం పోర్టు చైర్మన్ డివిఎస్.రాజుపై ఒత్తిడి తెచ్చి అదానీకి గంగవరం పోర్టును అప్పగించిందని విమర్శించారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలోని కాపులుప్పాడలో రూ.3 వేల కోట్ల విలువ కలిగిన 130 ఎకరాల భూమిని అప్పనంగా డేటా సెంటర్ పేర అదానీకి కట్టబెట్టిందన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, తిరిగి ఆ భూమిని అదానీ పరమే చేసిందన్నారు. ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. తాజాగా అమెరికా న్యాయవ్యవస్థ బయటపెట్టిన మహాకుంభకోణంలో ముడుపులు చెల్లించిన అదానీని, పుచ్చుకున్న రాజకీయ పెద్దలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్‌తో పాటు భీమిలి బీచ్ శాండ్ మైనింగ్, డేటా సెంటర్ భూములు, గిరిజన ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు, గంగవరం పోర్టు.. ఇలా అదానీ గ్రూపుతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ గంగవరం పోర్టు విలువ 2015 నాటికి రూ.16 వేల కోట్లు అయితే కేవలం రూ.6 వేల కోట్లుకు అదానీకి కట్టబెట్టారన్నారు. డివిఎస్.రాజుకు ఆనాడు బిఒటి పద్దతిలో ఇస్తే, దానిని అమ్మడానికి అర్హత కూడా ఆయనకు లేకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి బలవంతంగా ఇప్పించారని సిపిఎం ఆనాడే ఆరోపించిందని గుర్తు చేశారు. ఇది స్టీల్‌ప్లాంట్ కోసం నిర్మాణం చేసిన పోర్టుగనుక దానిని ప్లాంట్‌కే అప్పగించాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.