విద్యుత్‌ ఛార్జీల పెంపు సరికాదు.. ప్రతిపాదనలు విరమించుకోవాలి : సిపిఎం

ప్రజాశక్తి-గుంటూరు : సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు హెచ్చరించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో మంగళవారం నిరసన తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించడం తగదన్నారు. సర్ధుబాటు ఛార్జీల పేరుతో రూ.8113 కోట్ల భారం మోపటానికి సిద్ధమైందని తెలిపారు. గత ప్రభుత్వం ఇంధన సర్‌ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపిందన్నారు. ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోందన్నారు. బిజెపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో విద్యుత్‌ భారాలు పెంచడం సరికాదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఈమని అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, ఎమ్‌.రవి, తదితరులు పాల్గొన్నారు.

➡️