హంద్రీనీవా కాలువ వెడల్పు కోసం 27 నుంచి ధర్నాలు : సిపిఎం

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : హంద్రీనీవా కాలువను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేయాలన్న డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి రాయలసీమ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ తెలిపారు. బుధవారం అనంతపురం నగరంలోని గణేనాయక్‌ భవన్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, ఆర్‌. చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, వి.రామిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, మదనపల్లి జిల్లాలకు హంద్రీనీవా ప్రాజెక్ట్‌ ద్వారా దాదాపు 6 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వల్సుందన్నారు. 2012 నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీరు వస్తున్నా ఒక్క ఎకరం ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మొదటి దశ కింద అనంతపురం జిల్లాలో 3.45లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి పంట కాలువలు తవ్వలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రాయలసీమ సాగునీటి వనరుల అభివృద్ధి ఆశించినంతగా జరగడం లేదన్నారు. పంట కాలువల కోసం భూసేకరణ కూడా పూర్తి అయిందన్నారు. హంద్రీనీవా నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు రావడానికి కాలువ వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 3450 క్యూసెక్కుల నుంచి 6300 క్యూసెక్కుల నీరును విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందన్నారు. ప్రస్తుతం కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్‌ వేయడానికి 404, 405 జీవోలను విడుదల చేసిందన్నారు. రూ.930 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. అయితే కాలువ వెడల్పు చేయకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. కాలువ లైనింగ్‌ పనుల వలన భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందన్నారు. ఇదే భావనను రైతు సంఘాలు జలసాధన కమిటీ ఇతర రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడం, పంట కాలవలను తవ్వడం కార్యక్రమాలను తక్షణం చేయాలని కోరుతూ రాయలసీమ జిల్లాలలో ఈ నెల 27న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 న అనంతపురం హంద్రీనీవా సుజల స్రవంతి సర్కిల్‌ ఆఫీస్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతులు, ప్రజలు, మేధావులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

➡️