ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై శుక్రవారం మోపిన రూ.9,412 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే విధించిన రూ.6,029 కోట్ల వసూలు డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుండగా, మరలా ఈ భారం వేయడం దారుణమన్నారు. ఎపిఇఆర్‌సి కనీసం పబ్లిక్ హియరింగ్ కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా ట్రూఅప్ విధించడం అన్యాయమని, చట్టవిరుద్ధమని విమర్శించారు. పారదర్శకత గురించి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడుతామని గొప్పలు చెప్పే పాలకులు ఇలాంటి నిరంకుశ పోకడలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. అదాని కుంభకోణం వెల్లడైన నేపథ్యంలో అదనపు ఛార్జీలు కార్పొరేట్ల లాభాపేక్ష కోసమేనని రుజువైందని తెలిపారు. ఈ భారాలను ప్రజలు భరించాల్సిన అవసరం లేదని, తాజా ప్రతిపాదన వల్ల 2025 జనవరి నెల బిల్లు నుండి రెండేళ్ల పాటు నెలనెలా యూనిట్‌కు రూ.0.45 నుండి రూ.0.46 పైసలు చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలకు 30 యూనిట్లు వాడే నిరుపేదలు ఇంధన ఛార్జీగా రూ.1.90 నిర్ణయించగా, ట్రూఅప్ ఛార్జీగా యూనిట్‌కు రూ.1.73 అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించారు. దీనివల్ల పెంపుదల 91 శాతం అవుతుందని, చార్జీ యూనిట్‌కు రూ.3.63 అవుతుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసిన టిడిపి కూటమి గద్దెనెక్కాక మాట నిలబెట్టుకోలేదని, ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనంగా డబ్బు చెల్లించాలన్న ట్రూఅప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో తెగతెంపులు చేసుకోవాలని కోరారు.