రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు : సిపిఎం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎండనకా, వాననకా, అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటు వేసిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు సిపిఎం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజానీకంతో పాటు సిపిఎం, సిపవై, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. సిపిఎం పోటీచేసిన అరకుపార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఇండియా బ్లాక్‌లోని సిపిఐ, కాంగ్రెస్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీలకు ఓటేసిన ప్రజలకు, శ్రేయోభిలాషులకు ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రత్యేకించి రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల తరుపున నిరంతరాయంగా పనిచేసిన పౌర సంఘాల నాయకులకు, రాజ్యాంగ పరిరక్షణ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కె.విజయరావు, ప్రత్యేక హోదా నాయకులు చలసాని శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ తదితరులకు వారి బృందాలకు సిపిఎం రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. వివిధ రూపాల్లో మద్దతిచ్చిన సిపిఐఎంఎల్‌తో సహా అన్ని వామపక్ష పార్టీలకు, అమ్‌అద్మీ, విసికె పార్టీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. లౌకికతత్వ పరిరక్షణ కోసం ఎన్నికల్లో పనిచేసిన వివిధ ప్రజా సంఘాలు ప్రత్యేకించి కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహిళ, సామాజిక రంగాలకు, ఆదివాసీ, దళిత సంఘాల నాయకులకు, సోషల్‌మీడియా, జర్నలిస్టులకు ధనవ్యాదాలు తెలిపారు. ఎన్నికల్లో తీర్పు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల తరుపున సిపిఎం నిరంతరాయంగా నిలబడి భవిష్యత్‌లో కూడా పోరాడుతుందని హామీ ఇస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

➡️