సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలి

  • వ్యవసాయ పంప్‌ సెట్లకు స్మార్ట్‌మీటర్లు తొలగించాలి
  • హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విద్యుత్‌ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు తొలగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుధవారం లేఖ రాశారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో వివిధ రూపాల్లో మోపిన విద్యుత్‌, ఇతర భారాలను తగ్గిస్తామని, ఛార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ఆ హామీకి భిన్నంగా విద్యుత్‌ ఇంధన సర్దుబాటు ఛార్జీలు (ఎఫ్‌పిపిసిఎ) 2022-23 సంవత్సరానికి రూ.8,114 కోట్ల భారం వేస్తూ మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో విద్యుత్‌ నియంత్రణ మండలి నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో రూ.11 వేలకోట్లకు పైగా సర్దుబాటు ఛార్జీలు భారం మోపుతున్నారని వార్తలు వస్తున్నాయని తెలిపారు. మొత్తం దాదాపు రూ.20 వేల కోట్లు భారం విద్యుత్‌ వినియోగదారులు, రాష్ట్ర ప్రజలపై పడుతోందని వివరించారు. ప్రైవేటు విద్యుత్‌ కంపెనీల దోపిడీ, అధికరేట్లకు పవర్‌ ఎక్స్ఛేంజిలో స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు, వివిధ స్థాయిల్లో అవినీతి, అపసవ్య విధానాల వల్ల విద్యుత్‌ వ్యయం పెరుగుతోందని తెలిపారు. ఆ భారాన్ని సర్దుబాటు ఛార్జీల రూపంలో జనం నెత్తిన వేయడం అసమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ పేర్లతో విద్యుత్‌ ఛార్జీలు అధిక భారంగా ప్రజలు భావిస్తున్నారని, వారికి ఉపశమనం కలిగించాల్సింది పోయి ఇలాంటి అదనపు భారాలు మోపడం సరికాదని పేర్కొన్నారు. తక్షణమే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏనాడో వాడుకున్న విద్యుత్‌కు ఆ తర్వాత కాలంలో అదనంగా వేసే సర్దుబాటు ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రతిపాదిత ఇంధన సర్దుబాటు అంశం ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, డిస్కాములు మంగళవారం నాడు వివరణ ఇచ్చాయని పేర్కొన్నారు. పాత ప్రభుత్వ హయాంలోని అదనపు భారం విధించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడకూదని తెలిపారు. అలా చూసినా ఎఫ్‌పిపిసిఎ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు అక్రమంగా బిగించిన స్మార్ట్‌మీటర్లు తొలగిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, ఆ మేరకు వాటిని తొలగించాలని శ్రీనివాసరావు కోరారు.

➡️