CPM: ఉపాధి ఉసురు తీసేందుకే జాబ్‌కార్డుల తగ్గింపు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఉపాధి ఉసురు తీసేందుకే జాబ్‌ కార్డులను తొలగించారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిచేయడానికి పొందిన జాబ్‌కార్డులను ఏకంగా 35 లక్షలు తొలగించినట్లు పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసేవారి సంఖ్య తగ్గిందని చెప్పి బడ్జెట్లో కోత పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతి ఒక్కరూ (జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ మినహా) జాబుకార్డు తీసుకోవచ్చని అన్నారు. తక్షణమే జాబ్‌కార్డు రద్దును ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చినప్పటి నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 80 లక్షలు జాబుకార్డులు ప్రభుత్వాలు మంజూరు చేశాయని పేర్కొన్నారు. ఇందులో ఏ సంవత్సరమూ 60 నుండి 70 శాతానికి మించి పనులు కల్పించలేదని పేర్కొన్నారు. పనికోసం అర్జీలు పెట్టుకున్నా పనిచూపడం లేదని, పని చూపకపోతే వేతనంలో 50 శాతం నిరుద్యోగ భృతి చెల్లించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్కరికీ నిరుద్యోగ భృతి చెల్లించలేదని తెలిపారు. గడిచిన పదేళ్లలో గ్రామీణ పేదల కుటుంబాల్లో పిల్లలు పెద్దవారై పెళ్లి చేసుకుని విడిగా ఉంటున్నా పాత జాబుకార్డుతోనే పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఒక జాబ్‌కార్డుపై ఇద్దరు పనిచేస్తే ప్రస్తుతం నలుగురు పనిచేయడంతో 100 రోజులు పూర్తవుతున్నాయని, 16 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు ఇవ్వాలని చట్టంలోనే ఉందని తెలిపారు. ఈ చట్టాన్ని పక్కకు పెట్టి పేదలకిచ్చే నిధులకు కోత పెట్టడానికి కార్డులు తగ్గించారన్నారు. కార్డులను కుదించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున తీవ్రంగా ఖండించారు.
ఎయిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలి
మంగళగిరి ఎయిమ్స్‌లో బోధనా సిబ్బంది ఖాళీలు 48 శాతం, బోధనేతర సిబ్బంది ఖాళీలు 32.5 శాతం వెంటనే భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. 38 మంది డాక్టర్లు రాజీనామా చేయడంపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను కేటాయించిందని తెలిపారు. సామాన్య ప్రజలకు ఎయిమ్స్‌ వైద్యం అందుబాటులోనూ, ఉపయోగకరంగానూ ఉందని తెలిపారు. బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, డాక్టర్లు, ఖాళీలు భర్తీ చేస్తే సామాన్య ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, దీనికోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

➡️