పోస్టల్‌ బ్యాలెట్‌లో గందరగోళాన్ని తొలగించాలి

  •  సిఇఒకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌పై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సోమవారం సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనాకు ఆయన లేఖ రాశారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు జరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మీనా దృష్టికి తీసుకొచ్చారు. ట్రైనింగ్‌ క్లాసుల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ రాలేదని, చివరి నిమిషంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారని పేర్కొన్నారు. ట్రైనింగ్‌ పూర్తయిన వారు ఎక్కడ ఓటు వేయాలో తెలియక అయోమయంలో ఉన్నారని వివరించారు. ఫారమ్‌ 12 సమర్పణతో సంబంధం లేకుండా ఓటు హక్కు ఏ నియోజకవర్గ పరిధిలో ఉంటే అక్కడ ఓటు వేయాలని అంటున్నారని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు 4వ తేదీన మచిలీపట్నం రావాలని సంబంధిత ఉద్యోగులకు తెలియజేసి ముందస్తు సమాచారం లేకుండా 6వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు. సత్యసాయి, విజయవాడలో మూడు గంటలు ఆలస్యమైందని, ఉక్కపోత కారణంగా క్యూలైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఒంగోలులో ఓటరు ధ్రువీకరణ పత్రంలో గెజిటెడ్‌ అధికారులు సంతకం చేయలేదని, సత్యసాయి జిల్లాలో 150 ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఏలూరులో ఫారమ్‌ 12 ఎక్కడ అందజేశారో అక్కడే ఓటు వేయాలని అధికారులు చెప్పారన్నారు. ఈ గందరగోళం తొలగించి స్వేచ్ఛగా ఇబ్బందులు లేకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే అంగన్‌వాడీ ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియ చివరిలో ఉపయోగించుకుంటామని అధికారులు చెబుతున్నారని, చివరి నిమిషంలో చెబితే ఓటు వేసే అవకాశం ఉండదని అన్నారు. అటువంటి అంగన్‌వాడీ ఉద్యోగులకు మే 13 తరువాతైనా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

➡️