వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంలో కలిసికట్టుగా పోరాడాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

నెల్లూరు : రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నిటిపై వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంలో అంతా కలిసికట్టుగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరులో ప్రారంభమైన సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ వేదికపై శ్రీనివాసరావు ప్రసంగించారు. రాష్ట్ర పరిస్థితిపై పార్టీ తీర్మానం గురించి వివరణ ఇచ్చారు. నేడు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. ప్రజల అప్పుల గురించి ఆలోచించాలన్నారు. ప్రజలను అప్పుల బాధల నుండి ఎలా గట్టెక్కించాలి.. వారి జీవన ప్రమాణాన్ని ఎలా పెంచాలి.. అని ఆలోచించకుండా…. ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ఈ అప్పులను తీర్చుకోవడానికి ప్రజలపై పన్నులేస్తాం.. ప్రజలు భరించాలి అనడం శోచనీయమన్నారు. ప్రజలకు రోడ్లు కావాలంటే రోడ్డు ట్యాక్సులు వేస్తాం అంటున్నారనీ .. ఎంతకాలం ఇలా జనాన్ని బాదుతారు ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వేసిన భారాలను భరించలేకనే అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. ధరలు తగ్గిస్తారు, ఉద్యోగాలిస్తారు, అభివృద్ధి చేస్తారు, సంక్షేమాన్ని అమలు చేస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనాలు నిరాశకు గురయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రం మతసామరస్యానికి పెట్టింది పేరని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకంగా బిజెపిని చెత్త బుట్టలో కొట్టారని గుర్తు చేశారు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహంపై ప్రజల గుండెలు రగిలిపోతున్నాయన్నారు. రాష్ట్రానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబు దావోస్‌కు వెళ్లడం, సింగపూర్‌కు వెళ్లడం చేసినా కానీ ఖాళీ చేతులతో వెనుతిరిగి రావల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్టుబడిదారుల చుట్టూ తిరిగే కంటే, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకొని ఉంటే పెట్టుబడిదారులు వారంతటవారే పరుగెత్తుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు కదా..! అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాను ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. మోడీ అంటే భయంతో అడగలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర హక్కు .. కానీ బిజెపి ప్రజలను మోసం చేసిందని, మాట తప్పిందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నేడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతోన్మాదాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో భాగస్వామిగానూ, కేంద్రంలోను బిజెపి ఉండి… దేవాలయాల్లో ఏదో అయిపోతుందనే భయాన్ని హిందువుల్లో సృష్టిస్తుందని విమర్శించారు. మత రాజకీయాలు చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలనే కుట్రతో బిజెపి వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రానికి దాపురించిన పెను ప్రమాదాన్ని అడ్డుకోవడం నేడు మనముందున్న ప్రధాన కర్తవ్యమని శ్రీనివాసరావు అన్నారు . జనసేన పవన్‌ ను అడ్డుపెట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ వారు ప్రజల్లో మతోన్మాదాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కులాల మధ్య చీలికలు తెచ్చి, దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి, దేవుడిని వ్యాపార వస్తువుగా మార్చి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ విధానం కేవలం రాష్ట్రానికి, కమ్యూనిస్టులకే కాదు… చివరికి తెలుగుదేశం ఉనికికి కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. బిజెపికి లొంగిపోయిన ప్రాంతీయ పార్టీలన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయని గుర్తు చేశారు. బిజెపితో పోరాడి నిలదొక్కుకుంటారా ? లేకపోతే లొంగిపోయి మిమ్మల్ని మీరే ఆత్మాహుతి చేసుకుంటారా ? తేల్చుకోవాలని అన్నారు. విశాఖకు కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి వచ్చి రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చామని, చంద్రబాబు, లోకేష్‌ అందరినీ అభినందించండి అని చెబుతూ … 3 నెలలు కార్మికులకు జీతాలు లేవని చెప్పారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ఇబ్బందుల్లో ఉందని కార్మికులను త్యాగం చేయాలనే వారు .. మీరేం త్యాగం చేస్తున్నారని అడిగారు. స్టీల్‌ ప్లాంట్‌ మాత్రమే అప్పుల్లో ఉందా ? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో లేదా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ఓ 3 నెలలపాటు ఎంఎల్‌ఎ లు, ఎంపీలు, మంత్రులు అందరూ జీతాలు తీసుకోకుండా త్యాగాలు చేసి ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించవచ్చును కదా ! అని అడిగారు. వారికైతే జీతాలు కావాలి.. అన్ని సౌకర్యాలూ కావాలి… కార్మికులు మాత్రం త్యాగాలు చేయాలా ? అని ధ్వజమెత్తారు. జీతాలివ్వకపోతే కార్మికులు ఎలా పనిచేయగలరు ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పుల్లో ఉందంటూ … ప్రజలపై పన్నులేస్తున్నారనీ, ధరలు పెంచుతున్నారనీ అన్నారు. ఈ విధానమే కొనసాగితే గత ప్రభుత్వం నేర్చుకున్న పాఠం కంటే పెద్ద పాఠం ఈ ప్రభుత్వం నేర్చుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి బకాయిలున్నాయని తెలిపారు. రూ.21 వేల కోట్లు పాత బకాయిలు కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావల్సి ఉందని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. పోలవరం కాంట్రాక్టులకు మాత్రం నిధులు తెస్తారు కానీ నిర్వాసితులకు నిధులు తేకుండా వారిని గోదాట్లో ముంచుతున్నారని నిప్పులుచెరిగారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తెస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా అని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని వదిలి మిట్టల్‌ కు గనుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు కోసం మాత్రం ఒక్కసారి కూడా రాయబారం చేయబోరని ఎద్దేవా చేశారు. గవర్నమెంటుకు సంబంధించిన విశాఖ ఉక్కును సెయిల్‌లో ఎందుకు కలపడం లేదు ? అని శ్రీనివాసరావు  ప్రశ్నించారు. కేవలం పక్షపాతంతో ప్రభుత్వ రంగాలను, ప్రజలను ముంచి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు. నేడు విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని, స్మార్ట్‌ మీటర్లు పెడుతున్నారని, రూ.500 రావల్సిన చోట రూ.5 వేలు వస్తున్నాయని అన్నారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టడం వల్ల ఛార్జీలు పెరుగుతున్నాయని అంటున్నారు… ఎవరు స్మార్ట్‌ మీటర్లు పెట్టమన్నారని నిలదీశారు. అదానీల లాభాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. విద్యుత్‌ ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిపిఎం మహాసభ పిలుపునిస్తుందన్నారు. దీనికి సంబంధించి క్యాంపెయిన్‌ కూడా చేయబోతున్నామన్నారు. పేదల ఇండ్ల కోసం, దళితుల స్మశాన వాటికల కోసం, ఆదివాసీల ఉద్యోగాల కోసం, జిఒ నెంబర్‌ 3 అమలు కోసం, నిరుద్యోగుల డీఎస్సీ కోసం పోరాడాలన్నారు. డీఎస్సీ పై మొదటి సంతకం చేశారు కానీ దానికే ఇంతవరకు దిక్కులేదని అన్నారు. వాగ్దానాల కోసం అడిగితే మబ్బుల్లో అరుంధతీ నక్షత్రాన్ని చంద్రబాబు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిష్కారం అడిగితే చేతులెత్తేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. ఎకానమిక్‌ సర్వే రిపోర్టు వచ్చిందని… కౌలు రైతులకు అత్యంత ఆదర్శవంతంగా కేరళలో ప్యాకేజీ ఇస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఎకనమిక్‌ సర్వేనే తెలిపిందన్నారు. ధాన్యం రైతులకు రూ.2,800 గిట్టుబాటు ధర ఇస్తున్నారని తెలిపారు. దేశంలోనే మానవాభివృద్ధిలో కేరళ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని సర్వే స్పష్టం చేసిందన్నారు. ఇది కేవలం వామపక్ష పాలన, వామపక్ష ఉద్యమాల వల్లనే సాధ్యమయ్యిందని ఉద్ఘాటించారు. వామపక్షాలే తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.

➡️