ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రపంచబ్యాంకు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో చేపడుతున్న రాజధాని పనులకు సంబంధించి మొత్తం 55 టెండర్లు పిలవాలని సిఆర్‌డిఎ నిర్ణయించింది. వీటిలో సివిల్ వర్కులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 28 టెండర్లను పిలిచారు. గురువారం కూడా రెండు టెండర్లు పిలిచారు. ఇంటీరియర్‌కు పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో కాంట్రాక్టర్చలతో చర్చలు జరుపుతున్నామని, ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత వాటిని ఖరారు చేస్తామని సిఆర్‌డిఎ అధికారులు తెలిపారు. ఈ టెండర్లపై ప్రపంచబ్యాంకు ప్రతినిధులు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను అధికారులు వారికి వివరించారు. ఇప్పటి వరకూ సుమారు రూ.5000 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచామని చెప్పినట్లు సమాచారం. ప్రతి టెండర్‌కూ ఒక కన్సల్టెన్సీని నియమించాల్సిన అంశంపైనా ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ప్రశ్నించగా, ఇప్పటికే కన్సల్టెంట్ల నియమాకాన్ని ఖరారు చేశామని అధికారులు వివరించినట్లు సమాచారం. నిధుల జమకు సంబంధించిన అంశంపైనా అధికారులు, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు చర్చించారు. టెండర్లు వివరాలను పరిశీలించిన అధికారులు నిధులను సిఆర్‌డిఎకు బదిలీ చేసే అవకాశం ఉందని తెలిసింది. సంక్రాంతి పండుగలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
కరకట్ట విస్తరణ పనులపై సమీక్ష
అమరావతికి కీలకమైన కరకట్ట విస్తరణ పనులపైనా అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న కరకట్టను నాలుగులైన్లుగా విస్తరించాల్సిన అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ చర్చించినట్లు తెలిసింది. ఉద్దండ్రాయునిపాలెం వైపు నుండి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే విస్తరణ అంశంలో ప్రస్తుతం జాతీయ రహదారి వద్ద కరకట్ట ఎత్తు సరిపోయినంతగా లేకపోవడంతో అదో సమస్యగా ముందుకు వచ్చినట్లు తెలిసింది. వెంకటపాలెం పరిధిలో విస్తరణకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇక్కడ జాతీయ రహదారి దిగువన కరకట్ట ఎత్తు తగ్గించడమా లేక దానికి సమాంతంగా మరొక కరకట్టను నిర్మించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. గ్రీన్ ట్రిబ్యునల్‌తో ముడిపడిన అంశం కావడంతో అధికారులు కొంత తటపటాయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగల్ వస్తే జాతీయ రహదారికి దిగువన సమాంతరంగా మరొక కరకట్టను నిర్మించి ప్రస్తుతం ఉన్న దాన్ని రహదారిగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.