రాయపూడికి సిఆర్‌డిఎ కార్యాలయం

Jun 8,2024 22:38 #ap crda, #Rayapudi
  • రాజధాని పరిధిలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై తనిఖీలు
  • వారంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలో ఉన్న సిఆర్‌డిఎ కార్యాలయాన్ని వీలైంత త్వరగా రాయపూడిలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సిఆర్‌డిఎ కమిషనర్‌కు ఆదేశాలు వెళ్లాయి. నిర్మాణంలో ఉండి ఆగిపోయిన భవనాల సామర్థ్యం, అక్కడ సామాగ్రికి సంబంధించిన అన్ని వివరాలూ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. 2018లో సీడ్‌ యాక్సెస్‌ రహదారికి ఆనుకుని రాయపూడి వద్ద సిఆర్‌డిఎ కార్యాలయాన్ని నిర్మించారు. నాలుగు అంతస్తులతో చేపట్టిన ఈ భవనం అనంతరం నిలిచిపోయింది. 2019 ఎన్నికల తరువాత ఆ భవనంలో చిన్న పని కూడా చేపట్టలేదు. ఇంటీరియర్‌ ఏర్పాటు చేస్తే వినియోగంలోకి వచ్చే భవనాన్ని అప్పట్లోనే వదిలేశారనే విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని వెంటనే పూర్తి చేయడంతోపాటు దాన్ని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా మార్చాలని, అక్కడ నుండే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గ్రామాల్లో మినహా మిగిలిన ప్రాంతమంతా పిచ్చిమొక్కలు మొలిచి అడవిగా మారిన నేపథ్యంలో వాటిని క్లియర్‌ చేయడం పెద్ద పనిగా ఉంటుంది. పాత ప్లాను ప్రకారం నగరాన్ని సరిచేయాలన్నా, ప్లాట్లు, లేఅవుట్లు, రోడ్లు తదితర వ్యవహారాలను కొలిక్కి తేవాలన్నా, కనీసం ఆరునెలలపైగా పడుతుందని అంచనా వేశారు. ఈలోపే అక్కడకు సిఆర్‌డిఎ కార్యాలయం తరలించడంతోపాటు వీలైనన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా అక్కడ నిర్మాణంలో ఉన్న భవనాల్లోకి తరలించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో సిఆర్‌డిఎ అధికారులు ఆగమేఘాల మీద రాజధాని పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. తొలుత పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు వీలైనంత తొందరగా రాజధానిలో సిఆర్‌డిఎ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ నుండే పనులను పర్యవేక్షించడం వంటివి చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా శనివారం సిఆర్‌డిఎ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ నిర్మాణం నిలిచిపోయిన అన్ని భవనాలనూ పరిశీలించారు. ముళ్ల కంప పనులనూ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటికే సుమారు 100 జెసిబి యంత్రాలను దిగుమతి చేసుకున్నామని, 76 వరకూ పనిలో ఉన్నాయని తెలిపారు. వీలైనంత తొందరగా సిఆర్‌డిఎ భవనాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

➡️