సంపద సృష్టించి పేదలకు పంపిణీ

  • ఈ నెలలోనే మెగా డిఎస్‌సి
  • పేదలను ఆదుకునేందుకే పి-4
  • త్వరలో మండలాల స్థాయిలో అన్న క్యాంటీన్లు : చంద్రబాబు

ప్రజాశక్తి- బాపట్ల జిల్లా : ఈ నెలలోనే మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని. పాఠశాలలను తెరిచే నాటికి జూన్‌లోగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళవారం ఆయన బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలోని ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పింఛను పంపిణీ చేశారు. వడ్లమూడి సుభాషిణికి మానసిక వికలాంగురాల పింఛను, బత్తుల జాలమ్మకు వితంతు పింఛను అందజేశారు. వారి కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ‘పేదల సేవలో పింఛను పంపిణీ’లో భాగం ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు చేస్తామని, పేదరికం నిర్మూలనకే పి-4 విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రజలే ముందు అని, ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని, వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పింఛన్లతో సమానమని అన్నారు. పార్టీని ఆదుకున్న వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకితీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు పవన్‌ కల్యాణ్‌, తాను, బిజెపి జతకట్టామని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నానని తెలిపారు. రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టామని, అమరావతికి నాలుగేళ్లలో వైభవం తెస్తామని అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతామన్నారు. త్వరలో మండలాల స్థాయిలో అన్న క్యాంటీన్లు పెడతామని తెలిపారు. గత ఐదేళ్లూ రోడ్లు ఎలా ఉన్నాయో చూశామని, ప్రస్తుతం రోడ్ల మరమ్మతులు చేపట్టామని అన్నారు. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ మేలో ‘తల్లికి వందనం’ ఇస్తామని తెలిపారు.

పేదరికం లేని సమాజమే నా ఆశయం

పేదరికం లేని సమాజమే తన ఆశయమని సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే పి-4 కార్యక్రమం రూపొందించామ న్నారు. సమాజంలో ఉన్నతంగా ఉన్న పది శాతం సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాలను ఆదుకొని వారి అభ్యున్నతికి స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. పేద కుటుంబాలను ఆదుకునే వారు మార్గదర్శిగా, ఆదుకోబడిన వారు బంగారు కుటుంబంగా పరిగణించబడతారని చంద్రబాబు వివరించారు. అంబేద్కర్‌, అబ్దుల్‌ కలాం, ఎన్‌టిఆర్‌ సహా ఎవరూ పుట్టుకతోనే గొప్పవారు కాదని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, పింఛను, ప్రతి ఇంటికీ తాగు నీటి కుళాయి, కరెంటు, మరుగుదొడ్లు, డ్రెయినేజ్‌, ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఎంపి తేనేటి కృష్ణప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి, పర్చూరు, చీరాల, బాపట్ల శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, మద్దులూరి మాలకొండయ్య, వేగేసిన నరేంద్ర వర్మ, బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ సలగల రాజేష్‌బాబు, ఎస్‌పి తుషార్‌ డూడి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️