- సాగు నీటి కోసం రైతుల ధర్నా
ప్రజాశక్తి – తాళ్లరేవు సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాల్లో దిగి రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పి మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో నీటి కొరతతో పంట ఎండిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు ఆధ్వర్యంలో రైతులు ఎండిపోతున్న పంట పొలాల్లోకి దిగి ధర్నా చేశారు. పంట పొలాల్లో నెర్రలు తీసిన మట్టి పెళ్లలను చేతితో పట్టుకుని నిరసన తెలిపారు. గ్రాంటు ప్రాంతంలోని పంట పొలాల్లో వెదజల్లు విధానంలో పంట వేసి సుమారు 15 నుంచి 20 రోజులు అయిందని, అయినా నేటికీ పంట కాలువ ద్వారా చుక్కనీరు సరఫరా కాలేదని రైతులు పిల్లి లోవరాజు, పంపన శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జోరుగా కురిసిన వర్షాల సమయంలో పైనున్న నీరు దిగడానికి సాగునీటి కాలువకు సరఫరా నిలుపుదల చేశారని, పై పొలాల నుంచి నీరు దిగిపోయినా తమ పొలాలకు అధికారులు సాగునీరు ఇవ్వడంలేదని వాపోయారు. ఖరీఫ్ సాగులో ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఏడాదీ ఎదుర్కొంటున్నా అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోతున్నారని, ఒఎన్‌జిసి పైప్‌లైన్ ద్వారా అయినా సాగునీరు ఇప్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారులు గ్రాంటు ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు వచ్చేలా వెంటనే చర్యలు చేపట్టాలని, లేనియెడల రైతాంగంతో కలిసి రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పితాని సత్తిబాబు, మేడిశెట్టి శ్రీను, బాదం ఏడుకొండలు, భైరవమూర్తి, సూరంపూడి సూరిబాబు, సూరంపూడి శ్రీను, కోరుకొండ కృష్ణమూర్తి పాల్గొన్నారు.