- రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దశల వారీ ఉద్యమం : కె ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి – ద్వారకాతిరుమల (ఏలూరు జిల్లా) : వరికి ఎకరాకు రూ.25 వేలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 50 వేలు ఇన్‌పుట్స్ సబ్సిడీ అందించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కల్యాణ మండపంలో మూడ్రోజులపాటు రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులు జరిగాయి. చివరి రోజు ఆదివారం నిర్వహించిన విస్తృత సమావేశంలో రాష్ట్ర్టంలోని రైతాంగ సమస్యలను చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. గ్రామస్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే రైతులంతా సంఘటితం అవ్వాలన్నారు. ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నష్టాలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అన్ని పంటలకూ పంటల బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతేడాది సంభవించిన కరువు, మిఛౌంగ్ తుపాన్ వల్ల పంట నష్టానికి పరిహారం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరుగుతున్న దీక్షల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమాలకు సమాయత్తం కావాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్, కొబ్బరి, జీడి, చెరకు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్న శివశంకరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె మోహన్‌రావు, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్, విజయనగరం జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ జివి సుబ్బారావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు పాల్గొన్నారు.