కిక్కిరిసిన విజయవాడ బస్‌స్టేషన్‌

May 12,2024 21:15 #crowded, #Vijayawada bus station

– సర్వీసులు లేక అల్లాడిన ప్రయాణికులు
రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు : ఆర్‌టిసి ఎమ్‌డి
ప్రజాశక్తి – విజయవాడ, అమరావతి బ్యూరో :విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఇతర సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చిన వారు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు వెళ్లేందుకు వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు. ఈ నెల 12న (ఆదివారం) హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలించడానికి 121 స్పెషల్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్‌టిసి అధికారులు వెల్లడించారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి ఇవి ఏమాత్రమూ చాలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్పెషల్‌ బస్సులో అదనపు ఛార్జీలు వెచ్చించి, కూర్చొనేందుకు సీటు లేక నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోయారు.
రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు : ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు
ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ సామగ్రిని గ్రామాలకు తరలించేందుకు 5,458 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓటర్లకు అవసరమైతే రద్దీని బట్టి 40 మంది వున్నామని కోరితే ఆ ప్రాంతానికి నేరుగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌కు 1,066, బెంగళూరుకు 284 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఎక్కువగా నడుపుతున్నామన్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేసిందని, ప్రత్యేక బస్‌ సర్వీసుల కోసం 9959111281 నెంబరును సంప్రదించాలని సూచించారు.

➡️