సిఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు : సిఎస్‌ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈనెల 12న సిఎంగా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సభకు ప్రధాని మోడీ, గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సిఎస్‌ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి హరీష్‌కుమార్‌గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవిచంద్ర, శశిభూషణ్‌కుమార్‌, అదనపు డిజిపి బాగ్చి, టిఆర్‌ అండ్‌ కార్యదర్శి పిఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్‌, శ్రీదర్‌, సిఆర్‌డిఎ కమిషనరు వివేక్‌యాదవ్‌, ఎపి జెన్‌కో సిఎమ్‌డి చక్రధర్‌బాబు, ఏలూరు రేంజ్‌ డిఐజి అశోక్‌కుమార్‌, కృష్ణ, ఎన్‌టిఆర్‌ జిల్లాల కలెక్టర్లు డికె బాలాజీ, ఢిల్లీరావు, విజయవాడ పోలీస్‌ కమిషనర్లు పిహెచ్‌డి రామకృష్ణ, మునిసిపల్‌ కమిషనరు స్వప్నిల్‌ దినకర్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా జెపి సంపత్‌కుమార్‌, గన్నవరం విమానాశ్రయ డైరెక్టరు లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

మంత్రివర్గ ప్రమాణస్వీకార ఏర్పాట్ల పర్యవేక్షణకు ఐదుగురు ఐఎఎస్‌లు
ఈనెల 12న జరుగునున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం ఐదుగురు ఐఎఎస్‌ అధికారులను నియమించింది. ఐదుగురు ఐఎఎస్‌ అధికారులు తక్షణమే ప్రిన్సిపల్‌ సెక్రటరీ టూ గవర్నమెంట్‌ (పొలిటికల్‌) రిపోర్టు చేసుకోవాలని శనివారం అత్యవసర సర్క్యులర్‌ జారీ చేశారు. ఐదుగురు ఐఎఎస్‌ అధికారుల్లో బాబు ఎ, డాక్టర్‌ ఎమ్‌ హరి జవహర్‌లాల్‌, కె.కన్నబాబు, సిహెచ్‌ హరికిరణ్‌, జి. వీరపాండియన్‌ ఉన్నారు.

➡️