ఫూలే సేవలు మరువలేం : సిఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, విద్యా భ్యాసంలో మహిళలను ప్రోత్సహించడం, వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మ జ్యోతి బా ఫూలే అందించిన సేవలు మరువలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. జ్యోతి బా ఫూలే వర్థంతి సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన వర్గాలకు విద్యను అందించడంలో ఫూలే విశేషమైన కృషి చేశారన్నారు. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ను స్థాపించారన్నారు. ఫూలేకు నివాళులర్పించిన వారిలో సిఎం ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, కార్యదర్శులు ఎవి రాజమౌళి, ప్రద్యుమ్న, సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి : చీఫ్‌ విప్‌ జివి ఆంజనేయులు

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి ఆయా వర్గాలకు జ్యోతిరావు ఫూలే ఆశాజ్యోతిగా పేరుగాంచారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జివి ఆంజనేయులు అన్నారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన ఫూలే వర్థంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కుల వ్యవస్థను, జాతి వివక్షను, స్త్రీ అణచివేతను వ్యతిరేకించారని, సమాజంలో సమానత్వం కోసం ఫూలే కృషి చేశారని అన్నారు. సమాజ శ్రేయస్సుకే తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. ఫూలేకు నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, టిడిపి నాయకులు జంగా కృష్ణమూర్తి, గౌడ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గురుమూర్తి, పద్శశాలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అబద్దయ్య, టిడిపి నాయకులు రఘురామరాజు, కోటేశ్వరరావు, హసన్‌ బాషా, పీరయ్య, బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన జగన్‌ : రమేష్‌యాదవ్‌

బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పని చేసిన జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు జగన్‌ కృషి చేశారని ఎమ్మెల్సీ ఆర్‌.రమేష్‌ యాదవ్‌ అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఫూలేకు నివాళులర్పించారు. బిసిలకు నిజమైన న్యాయం జరిగింది జగన్‌ పాలనలోనేని చెప్పారు. నివాళర్పించిన వారిలో మాజీ మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, లిడ్‌ క్యాప్‌ మాజీ ఛైర్మన్‌ రాజశేఖర్‌, పార్టీ నాయకులు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️