ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సులభతర వాణిజ్యంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానంపై కేంద్ర ప్రభుత్వ అధికారి వందన గుర్నానితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు వేగంగా అవసరమైన అనుమతులు జారీచేయడంతోపాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగినచర్యలు తీసుకోవాలని సిఎస్ అన్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ రాష్ట్ర నోడల్ అధికారి వందన గుర్నాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సులభతర వాణిజ్యం కంప్లెయెన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 18 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రత్యేక టాస్క్పు ఫోర్సు కమిటీ జాతీయ స్థాయిలో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ మాట్లాడుతూ వికసిత్ ఎపి 2047లో భాగంగా ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాల కల్పన లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
