ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న మూడు నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ కె.విజయానంద్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పులు సన్నద్ధతపై గురువారం సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. వడగాల్పుల నుంచి కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కలిగించాలని విపత్తుల నిర్వహణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధికూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రధమ చికిత్స వంటి కనీససౌకర్యాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,జిల్లా స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ఈ సమీక్షలో విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండి రోణంకి కూర్మనాథ్ పాల్గొన్నారు.
