- స్థాపించిన పరిశ్రమలపై శ్వేత పత్రం విడుదల చేయాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేట్లకు వ్యవసాయ భూములు స్వాధీనపరచిన వైనంపై రాష్ట్ర ప్రభుత్వం నిగ్గుతేల్చాలని, ఈ 25 ఏళ్ల కాలంలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారు? ఎంత మంది ఉద్యోగాలు పొందారు? ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు దక్కాయో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవనంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 25 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు భూములను రైతుల నుంచి బలవంతంగా లాగేసుకొని పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సుమారు 1.48 లక్షల ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా బదలాయించినట్లు తెలిపారు. సెజ్, పారిశ్రామిక కారిడార్, ఎపిఐఐసి పేరుతో రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో కనీసం 20 శాతం కూడా పరిశ్రమలు స్థాపించలేదన్నారు. పరిశ్రమల పేరుతో కొందరు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగవేయగా, మరికొందరు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వివరించారు. రాజకీయ నేతలే కంపెనీలకు బినామీలుగా వ్యవహరిస్తూ లబ్ధిపొందుతున్నారని తెలిపారు. నక్కపల్లి ఇండిస్టియల్ కారిడార్ పేరుతో 6,500 ఎకరాలను సేకరించి మూడు వేల ఎకరాలను మిట్టల్ కంపెనీకి కేటాయించడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతోందన్నారు. ఈ చర్యతో 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను మూత వేయడానికి ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. అదేవిధంగా వాన్‌పిక్, లేపాక్షి, కాకినాడ పారిశ్రామికవాడ పేరుతో సేకరించిన వేలాది ఎకరాల భూములలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు. ప్రకాశం జిల్లాలో ‘నిమ్జ్’ పేరుతో 14 సంవత్సరాల క్రితం 20 వేల ఎకరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క కంపెనీని గానీ, ఒకరికి ఉద్యోగంగానీ కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. తాజాగా రిలయన్స్ కంపెనీ బయోగ్యాస్ ప్లాంట్ పేరుతో వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం నమ్మబలుకుతోందని, వాస్తవంగా 160 మందికి మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. భవిష్యత్తులో కంపెనీలకు భూ కేటాయింపులపై సమగ్ర చట్టం తేవాలని, దీనికి కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రంలో 110 ఎకరాల ఒంగోలు డెయిరీ టిడిపి వల్ల మూతపడిందన్నారు. మార్కాపురం ‘పలకల పరిశ్రమ’పై 25 శాతం జిఎస్‌టి విధించడం వల్ల ఆ పరిశ్రమ దివాళా తీసిందని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల జిల్లాలో గ్రోత్ సెంటర్‌లోని కంపెనీలు 50 శాతం మూతపడ్డాయని, చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో నెట్టబడిందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘పి-4’ పేరుతో కార్పొరేట్ కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా పేదరిక నిర్మూలన సాధిస్తామని ప్రజలను మభ్యపెట్టే చర్యలు మానుకొని తక్షణమే అభివృద్ధిపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన నిధులను రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. వేల కోట్ల రూపాయలు రాయితీ పొందుతూ, వేలాది ఎకరాలను అప్పనంగా పొందిన కార్పొరేట్ కంపెనీల సంపద, ఆస్తులపై పన్నులు వసూలు చేసి అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల ‘సిఎస్‌ఆర్’ నిధి రెండు శాతం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. అంతకు ముందు మార్క్సిస్టు యోధులు మాకినేని బసవపున్నయ్య 33వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు, కార్యదర్శివర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జివి.కొండారెడ్డి పాల్గొన్నారు.