ఫోన్‌ పే, గూగుల్‌ పేలో కరెంట్‌ బిల్లులు చెల్లించొచ్చు

అమరావతి : రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌తోపాటు ఫోన్‌పే ద్వారా విద్యుత్‌ బిల్లుల ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా విద్యుత్‌ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించారు. వినియోగదారులు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్‌ పే, గూగుల్‌ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్‌ లు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ క్రమంలో విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్‌ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర మళ్లీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఫోన్‌ పే, గూగుల్‌ పే చెల్లింపుల సస్పెన్షన్‌ కారణంగా సీపీడీసీఎల్‌లో చెల్లింపుల బకాయిలు భారీగా ఉండడంతో ఫోన్‌ పే ద్వారా కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. రానున్న నాలుగైదు రోజుల్లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు కూడా గూగుల్‌ పేతో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

➡️