Cyclone Effect – ఎపిలో దంచికొడుతోన్న వాన !

May 25,2024 13:53

అమరావతి : మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో … ఎపిలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల కుండపోత దంచికొడుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురుస్తోంది.

తీవ్ర తుఫానుగా రేమాల్‌ …
వాయుగుండం నేడు తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేస్తుంది. రేమాల్‌ తుఫానుగా నామకరణం చేసిన దీని ప్రభావం ఎపి పై ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోవడం ఊరట. తీవ్ర తుఫానుగా మారబోతున్న రేమాల్‌ రేపు అర్ధరాత్రి ఒడిశాలోని ఖేపుపరా, సాగర్‌ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావం తమిళనాడు, ఒడిశాలపైనే అధికంగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఎపి పై అంతగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. అయితే మోస్తరు వర్షాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.

అల్లకల్లోలంగా సముద్రం ….
వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్సకారుల్ని వేటకు వెళ్లద్దని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేడు, రేపు కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు చేస్తోంది. నిన్నటి నుంచి కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు ప్రకటించారు.

అనంతపురం జిల్లాతో పాటు విజయవాడలోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదులు గాలులతో కూడిన వాన పడింది. దీంతో పొలాల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపకల్లు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. బూదగవి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. విడపకల్లు మండలంలో వర్షం దెబ్బకు 19 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పొలికి -పెంచులపాటు, గోవిందవాడ-పాల్తూరు గ్రామాల మధ్య వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. గన్నవరం ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో గౌడపేట, వీఎస్‌పురంతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటర్ల ద్వారా తొలగిస్తున్నారు. కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తీర ప్రాంత నగరం కావడంతో వాయుగుండం ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా తీర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.

➡️