- అనుమానితుడి ఇంట్లో మృతదేహం
- తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన స్థానికులు
- వంటిపై గాట్లు… పగిలిన గాజులు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ప్రజాశక్తి- చేబ్రోలు (గుంటూరు జిల్లా) : రాష్ట్రంలో చిన్నారులపై అమానవీయ సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడిన వారికి షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సోమవారం రోజే బడికి వెడుతున్న ఒక చిన్నారి అమానుషానికి గురైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఒక దళిత బాలిక అత్యాచారానికి, హత్యకు గురైనట్టు సమాచారం. అనుమానితుడు ఇంటికి తాళం వేసుకుని పరారుకాగా, అతని ఇంట్లోనే బాలిక మృతదేహం లభించింది. తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన స్థానికులకు వంటిమీద గాట్లు, పగిలిన గాజులు, ప్రాణాలు పోయిన బాలిక కనిపించినట్లు చెబుతున్నారు. అయినా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో సోమవారం ఉదయం ఏడవ తరగతి చదువుతున్న ఒక దళిత బాలిక బడికి వెడుతుండగా నాగరాజు అనే వ్యక్తి ఆ బాలికతో మాట్లాడి కూల్‌డ్రింక్ ఇవ్వడాన్ని స్థానికులు గమనించారు. సాయంత్రమైనా ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు, ఆమె సోదరుడు వెతకడం ప్రారంభించారు. ఆ బాలిక సోదరునికి తాము చూసిన విషయాన్ని స్థానికులు తెలిపారు. ఆమేరకు నాగరాజు ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉంది. అయితే, ఇంటి బయట బాలిక చెప్పులు కనిపించాయి. కిటికిలోంచి చూడగా చలనం లేకుండా పడి ఉన్న బాలిక కనిపించినట్లు చెబుతున్నారు. దీంతో స్థానికులతో కలిసి బాలిక తల్లిదండ్రులు తాళాలు పగలగొట్టి ఇంటిలోపలకి వెళ్లి చూడగా ఆ బాలిక చనిపోయి ఉంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక మెడపై గోళ్ల గాట్లు గుర్తించినట్లు, గాజులు మంచంపై పగిలి ఉన్నాయని, చెవి కమ్ములు ఊడి పడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడే ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి డిఎస్‌పి రమేష్ మాట్లాడుతూ బాలిక మృతదేహం ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న నాగరాజుకు వివాహమైందని తెలిపారు. ఆయన భార్యను వదిలేసి మూడు సంవత్సరాలవుతోందని చెప్పారు. పరారీలో ఉన్న నాగరాజును పట్టుకోవడానికి పొన్నూరు రూరల్ సిఐ, రూరల్ ఎస్‌ఐలతో బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.