- నేలకొరిగిన అరటి, టమోటా, మొక్కజొన్న
- రాయలసీమ, విశాఖ, నెల్లూరులో చిరుజల్లులు
ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను తిరుపతి, కడప జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరి, చెరకు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, అరటి, టమోటా పంటలు నేలకొరిగాయి. వరి మడుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. నష్టపరిహారాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగమయ్యారు. ప్రకాశం జిల్లా పాకలలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. కడప, తిరుపతి, విశాఖ, కర్నూలు, నెల్లూరులో సోమవారం మోస్తారు వర్షాలు కురిశాయి.
తిరుపతి జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్లలో వర్షం కారణంగా నీట మునిగిన పంట పొలాలను, చెరువులను, స్వర్ణముఖి ఆనకట్టను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. సూళ్లూరుపేటలో 150 ఎకరాల వరి పంట నీట మునిగిందని ఆయన తెలిపారు. ఏర్పేడు మండలం రాజుల కండ్రిగ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయుడు రత్నకుమార్.. రేణిగుంటల నుంచి రాజుల కండ్రిగకు వెళ్లేందుకు గోవిందవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది కల్వర్టును ద్విచక్రవాహనంతో దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి వరదలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో ఆయనను రక్షించారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలోని 15 పంచాయతీలలో వరి నేలకొరిగింది. వర్షపు నీరు నిలిచి రైతులకు అపార నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. సదుం మండలంలో 25 ఎకరాల వరి పంట నీట మునిగింది. వెదురుకుప్పం మండలంలో చెరకు పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో వరి, మొక్కజొన్న, అరటి, టమోటా, చామంతి పూల తోటలు, బీన్స్ తదితర పంటలు నీట మునిగాయి. ఆయా పంటలకు సుమారు. రూ.1.54 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 55 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కడప జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి.
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో రోజంతా ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల చిరు జల్లులు పడ్డాయి. నంద్యాల, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శ్రీశైలంలో ఓ మోస్తారు వర్షం పడింది. నెల్లూరులో జల్లులు పడ్డాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీర ప్రాంతంలో అలల ఉధృతి అధికంగా ఉంది. కెరటాలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. వారం రోజులుగా మత్స్యకారులెవ్వరూ సంద్రంలోకి వెళ్లలేదు. అలల దాటికి వలలు, బోట్లను మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు..