నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం

  • గత సీట్ల నిష్పత్తి ప్రకారం చేస్తే అన్ని రాష్ట్రాలకూ సమన్యాయం
  • సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమని, అయితే, జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకున్న సీట్ల నిష్పత్తి ప్రకారం పునర్విభజన జరగడం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం జరుగుతుందని, దేశ సమైక్యతకు భంగం కలగకుండా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ‘పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన – ఫెడరలిజం’ అంశంపై నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సదస్సు జరిగింది. విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ వలి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 543గా ఉన్న లోక్‌సభ స్థానాలు 848కు పెరుగుతాయన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహించి పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉందని, 1976 అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేసి 25 ఏళ్ల పాటు పునర్విభజన జరగకుండా చేశారని తెలిపారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయిని అప్పటి తమిళనాడు సిఎం కరుణానిధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు కలిసి పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయన్ని వివరించి, 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు వాయిదా వేయించారని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ జరిగిందని, ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల్లో వెనుకబాటుతనం కారణంగా జనాభా విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఈ జనాభా ప్రకారం పార్లమెంట్‌ సీట్లను పెంచితే ఉత్తరప్రదేశ్‌లో 88 సీట్లు 128కు పెరుగుతాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 42 నుండి 48కు పెరుగుతాయని, దీనివల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతిని దేశ సమైక్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మోడీని టిడిపి, జనసేన పార్టీలు నిలదీయాలని, తమ అభిప్రాయమేమిటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసిపి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు బి.సలీం మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో మత రాజకీయాల ద్వారా తమ అధికారాన్ని మరో 25 ఏళ్లు నిలబెట్టుకోవడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు బి.నాగప్రసాద్‌ మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.

➡️