ప్రజాశక్తి – విజయవాడ : మతం వ్యక్తిగత విశ్వాసమని, దానిని రాజకీయాల్లోకి చొప్పించి లబ్ధిపొందాలని బిజెపి-మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్ శర్మ అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సోషలిస్టు వ్యవస్థాపకులు, మహోన్నత నేత లెనిన్ శత వర్ధంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద మంగళవారం ఆట-పాట-మాట కార్యక్రమం నిర్వహించారు. లెనిన్ శత వర్ధంతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఎపిపిఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శర్మ మాట్లాడుతూ… అయోధ్యలో రామమందిరాన్ని బిజెపి తన రాజకీయ రంగం మీదకు తీసుకొచ్చిందని విమర్శించారు. అభివృద్ధి నిరోధక విధానాలను అవలంభిస్తోన్న బిజెపి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన మోడీ ప్రభుత్వం ప్రజల ఆలోచనా ధోరణిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రతి విషయంలోనూ ప్రధాని మోడీ వద్ద సాగిలపడుతున్నారని విమర్శించారు. బాధల నుండి ప్రజలను విముక్తి చేసేది మార్క్సిజం-లెనినిజమేనని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ.. బిజెపి రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి లెనిన్ సిద్ధాంత భావజాలం ఆవశ్యకత పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు దీనస్థితిని తెలియజేసే నృత్య రూపకాన్ని కళాకారులు ప్రదర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ప్రజాశక్తి బుకహేౌస్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, నాయకులు వరప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సాహితీవేత్తలు గుమ్మ సాంబశివరావు, వెన్న వల్లభరావు, లంకా దుర్గారావు, సీనియర్ గాయకులు ఎ.జగన్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రజాశక్తి బుకహేౌస్ జనరల్ మేనేజర్ కె లక్ష్మయ్య, సాహితి పోషకులు గోళ్ల నారాయణరావు, బుడ్డిగ జమీందార్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి.మనోహర్ నాయుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదం : లెనిన్ శత వర్ధంతిలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, సిపిఐ నేత ఓబులేసు
