- బాయిలర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఘటన
- ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఆల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘటన మరువకముందే ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టిటిపిఎస్)లో సోమవారం అర్థరాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం… ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టిటిపిఎస్ ఐదో దశ ప్లాంట్‌లో బాయిలర్ నుంచి బూడిద బయటకు రాకుండా ఇరుక్కుపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. అయితే ఒక్కసారిగా డోర్లు ఓపెన్ అవటంతో మంటలతో బూడిద కార్మికులపై పడింది. దీంతో జెపిఎ ఉద్యోగి చక్రధర్, కాంట్రాక్ట్ కార్మికుడు వేముల అప్పారావు శరీర భాగాలు 40 శాతం కాలిపోయాయి. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, వైద్య బీమా సర్వీస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సిఐటియు నేతలు పరామర్శించారు.