డేంజర్‌ జోన్‌గా మారిన ప్రమాదస్థలం

Mar 13,2025 07:13 #Acident, #robos, #SLBC Tunnel
  • మల్లెల తీర్థం, నల్లవాగు నుంచి నీటి ఊట
  • సహాయక చర్యల్లో హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబో

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో ప్రమాద స్థలం డేంజర్‌ జోన్‌గా మారింది. మల్లెల తీర్థం, మల్లెవాగు, నల్ల కాలువ నుంచి నీటి ఊట అధికమై పనులకు ఆటంకం కలిగిస్తోంది. విద్యుత్‌కు అరగంట ఆంతరాయం ఏర్పడినా సొరంగం చెరువును తలపిస్తోంది. ఉబికి వస్తున్న నీటితో పాటు పై కప్పు నెర్రెలు బారి కూలే అవకాశాలు ఉన్నాయని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. టిబిఎం చివర పైభాగాన రివిట్‌మెంటు చేయకపోవడంతో జల్లెడ తూట్ల మాదిరిగా నీరు కురుస్తోంది. నీటితోపాటు రాళ్లు, మట్టి పడుతుండడంతో రెస్య్కూ టీంకు సహాయక చర్యలు ఆటంకంగా మారాయి. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్‌ సంస్థకు చెందిన అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబోను బుధవారం ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్‌ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం, వంటి సహాయక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. టన్నెల్‌లో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి రోబోలు ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. టన్నెల్‌ లోపల ఉన్న శిథిలాలు, మట్టి కుప్పలు, తేమ, ఆక్సిజన్‌ సమస్యలు వంటి అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని, రోబోలను రంగంలోకి దించినట్టు చెప్పారు. అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబో ద్వారా 40హెచ్‌పి పంపు సహాయంతో బురదను బయటికి పంపనున్నారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన బృందాలు పనిచేస్తున్నాయి.

➡️