అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

Apr 15,2025 00:18 #India's economy, #pose, #threat, #US tariffs

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఇటీవల అమెరికా పెంచిన సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో ప్రమాదం ఏర్పడనుందని ప్రముఖ అర్థశాస్త్ర ఆచార్యులు డాక్టర్‌ కె.పద్మ అన్నారు. ‘ట్రంప్‌ వాణిజ్య యుద్ధం – భారత్‌పై ప్రభావం’ అన్న అంశంపై అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సదస్సు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీ సభ్యులు కామేశ్వరరావు అధ్యక్షతన ఈ సదస్సు సాగింది. ముఖ్య వక్తగా హాజరైన పద్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న విధానాలకు కారణాలను తెలియజేశారు. ట్రంప్‌ తాజా నిర్ణయాలతో ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడనుందన్నారు. ప్రస్తుతం దేశాల మధ్య ఉన్న అంతరాల కారణంగా సుంకాల విధింపు ప్రారంభమైందని తెలిపారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాల ద్వారా స్టాక్‌ మార్కెట్లు పతనమై అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. సుంకాల పెంపు ద్వారా వాటిల్లే నష్టాలను తెలియజేశారు. సుంకాలు ఇలానే కొనసాగితే భారతదేశంలోని ఒక్క ఆక్వా రంగంలోనే 50 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఎంఎస్‌ఎంఇ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలను పెంచి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు ట్రంప్‌ పన్నాగం పన్నారన్నారు. ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులపై 35 శాతం ఎగుమతి సుంకాన్ని పెంచారని, తద్వారా భారతీయ వస్తువులను అమెరికా మార్కెట్లోకి రాకుండా చూస్తున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

➡️