ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌ పై ప్రతిష్టంభన

Oct 30,2024 07:11 #Housing

 ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌పై ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి స్థలాలను రెగ్యులరైజేషన్‌ చేయించి పట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల ముందు అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హామీలు గుప్పించారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు ఇళ్ల స్థలాలు, రెగ్యులరైజేషన్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కుటుంబాల వరకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నాయి. వీరంతా ఆయా స్థలాల్లో తాత్కాలిక, శాశ్వత కట్టడాలు నిర్మించుకుని విద్యుత్‌, కుళాయి కనెక్షన్లు పొందారు. మున్సిపాలిటీ, పంచాయతీలకు పన్నులు కూడా చెల్లిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. జగనన్న కాలనీలు పట్టణాలకు చాలా దూరంగా ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లేందుకు పేదలు ఇష్టపడటం లేదు. కాలనీల్లో ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరగా గత ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. టిడిపి ప్రభుత్వ హయంలో జారీ చేసిన రెగ్యులరైజేషన్‌ జిఒను వైసిపి ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో టిడిపి కూటమి ప్రభుత్వం మళ్లీ కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా ఉన్న మంగళగిరిలోనే దాదాపుగా 30,000 మంది నిరు పేదలు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. రైల్వే కట్టలు, చెరువులు, కాలువల పక్కన, రెవెన్యూ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి పట్టాలిపిస్తామని పలువురు టిడిపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భరోసా ఇచ్చారు. మంగళగిరిలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఈ అంశంపై ఇంకా ప్రభుత్వ నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి నారా లోకేష్‌ జిల్లా అధికారులను సంప్రదించగా ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి రెగ్యులరైజ్‌ చేసి పట్టాలిచ్చే అంశంపై గతంలో జారీ చేసిన జిఒ కాలపరిమితి ముగిసిందని, ప్రభుత్వం తాజాగా మళ్లీ జిఒ జారీ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదే రీతిలో దాదాపు రెండు లక్షల మంది ఈ కోవలోనే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నారు. వీరందరికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక తీర్మానం ద్వారా మంగళగిరి నియోజకవర్గం వరకు ప్రత్యేక జిఒ ఇవ్వాలా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

➡️