ఉన్మాదంతో వ్యవహరిస్తోంది

  • కూటమి ప్రభుత్వంపై వైసిపి అధికార ప్రతినిధి శ్రీనివాసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైసిపి అధికార ప్రతినిధి కొరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్టేడియానికి వైఎస్‌ఆర్‌ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. ఆయన పేరు కనిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విశాఖ సమీపంలో అంతర్జాతీయ స్టేడియానికి పెట్టిన పేరును తొలగించేందుకు సిద్ధమయ్యారని వివరించారు.

రాయలసీమ ద్రోహి చంద్రబాబు : తోపుదుర్తి

బాబు నిర్వాకంతోనే రాయలసీమ ఎత్తిపోతలకు బ్రేక్‌ పడిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సిఎం వల్ల రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ స్కీముపై నీలినీడలు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. కేంద్ర సంస్థల ముందు సీమ కష్టాలను వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. విభజన చట్టం కింద ఎపికి రావాల్సి ఉన్న 101 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు వైఎస్‌ జగన్‌ ముందు చూపుతో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే దానికి మోకాలడ్డారని విమర్శించారు.

➡️