- గుంటూరు జనరల్ ఆసుపత్రిలో నమోదు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, కొమరోలు (ప్రకాశం జిల్లా) : గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్)తో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.కమలమ్మ (60) ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈ వ్యాధి సోకిన తర్వాత తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుపడిపోవడంతో ఆమెను ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి నుంచి కుటుంబసభ్యులు ఈ నెల 3న తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కమలమ్మ పరిస్థితి విషమించి మృతి చెందారు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టు రావడం వల్ల ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. జిబిఎస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదయినట్టు అధికారులు ధ్రువీకరించారు. గత మూడు రోజుల్లో కొత్తగా ఏడు కేసులు రావడంతో కలకలం చేరిగింది., వారిలో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న ఇద్దరిలో షేక్ రమీజాన్ (44) మహిళ వెంటిలేటర్‌పై ఉన్నారు. మరొకరు జనరల్ వార్డులో చకిత్స పొందుతున్నారు. ఈ నెల 3న ఆస్పత్రిలో చేరిన కమ్మలమ్మ మృతితో ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేగింది. వ్యాధి నివారణకు, బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పి.సత్యకుమార్ ప్రకటించినా కమలమ్మ మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ వైరస్ సోకిన వారు పక్షవాతం వస్తుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నరాలు చచ్చుబడిపోవడం, రక్తహీనత సమస్య కూడా తీవ్రంగా ఉంటోంది. ఎక్కువమందికి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు ఇటీవల ప్రకటించారు. ఒక్కో రోగికి రూ.5 లక్షల వరకు చికిత్సకు ఖర్చవుతోందని తెలిపారు. కమలమ్మ మృతి నేపథ్యంలో గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ మాట్లాడుతూ ఈ ఏడాదిలో గురటూరు ప్రభుత్వాస్పత్రికి 140 కేసులు వచ్చాయన్నారు. సగటున నెలకు పది కేసులు వస్తాయని వివరించారు. చికున్ గున్యా, చికెన్ ఫాక్సు, కోవిడ్ వంటి వైరస్‌ల బారిన పడిన వారికి కూడా ఈ వైరస్ తొందరగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నీటి కాలుష్యం వల్ల కూడా ఇలాంటి వైరస్‌లు రావచ్చని, పూణేలో నీటి కాలుష్యం వల్లే ఎక్కువ కేసులు రావడం వల్ల ఈ కేసులు వెలుగు చూశాయని చెప్పారు.
అలసందలపల్లిలో అప్రమత్తం
కమలమ్మ (50) మృతితో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అలసందలపల్లి గ్రామాన్ని సందర్శించారు. కమలమ్మ ఇల్లు, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. గ్రామంలోని నీటి నమూలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదిక వచ్చాక దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.