– పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం
– ప్రభుత్వ భూముల్లో నివాసితులకు పట్టాలు
– కియా కార్ల షోరూం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా) : పరిపాలన ఒకే దగ్గర ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కియా మోటార్స్ రావడానికి చంద్రబాబు కారణమని తెలిపారు. ఇప్పుడేమో పరిశ్రమ ఏర్పాటుకు టిసిఎస్ ముందుకొచ్చిందని అన్నారు. జగన్ పాలనలో ఎన్ని కంపెనీలు తెచ్చారో? ఎన్ని ఉద్యోగాలిచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకొస్తామన్నారు. రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఉత్తరాంధ్రకు సర్వీసింగ్‌లు, కర్నూలుకు విండ్, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, కడప, చిత్తూరులకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, అనంతపురానికి ఆటోమొబైల్స్, ఉభయగోదావరి జిల్లాలకు ఆక్వా, పెట్రో కెమికల్ పరిశ్రమలు, కృష్ణా, గుంటూరులో అనేక యూనిట్లు, పెట్టుబడులు తెస్తామని వివరించారు. వరద సాయం విషయంలో లోపాలుంటే సరిచేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్‌బుక్ యాక్షన్ ఇప్పటికే మొదలైందని, వైసిపి వేరే బుక్‌లు పెట్టుకున్నా తమకేమీ భయం లేదన్నారు. గుంటూరులో ఇఎస్‌ఐ ఆస్పత్రి, మంగళగిరిలో ఎయిమ్స్‌కు నీటి సరఫరాతోపాటు వంద పడకల ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు. మూడు నెలల్లో మంగళగిరిలో భూగర్భ డ్రెయినేజీ పనులు చేపడతామని, దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలిస్తామని తెలిపారు.
