- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
- ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో విడివిడిగా భేటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేపడతామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎపి ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్, ఎపి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్‌లతో ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో పదేళ్ల నుంచి సంస్కరణలు అమలు చేయలేదన్నారు. అన్ని విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరగాలన్నారు. నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. సంస్కరణల అమలు చేసే క్రమంలో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపులు ద్వారానే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
ఈ ఏడాది ఆర్‌టిఎఫ్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి తొలి విడతలో రూ.788 కోట్లకు గానూ రూ.571.96 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్, ఆర్‌అండ్‌డి, ఇన్నోవేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాలలకు ఐదేళ్ల అప్లియేషన్ విధానాన్ని తీసుకురావాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యానికి అసోసియేషన్ విజ్ఞప్తి చేయగా, అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎప్పటికప్పుడు కేలండర్ ప్రకారం విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులను పెంచాలన్నారు. విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు కల్పించే అంశం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పి అశోక్‌బాబు, వేపాడ చిరంజీవి, ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వాసిరెడ్డి విద్యాసాగర్, చైతన్యరాజు, కె సుబ్బారావు, డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు శ్యామ్‌ప్రసాద్, గంటా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.