- స్టార్టప్‌లకు రూ.25లక్షల వరకు సీడ్ ఫండింగ్
- 2029 కల్లా 5లక్షల వర్క్ స్టేషన్లు
- ఐటి పాలసీపై సిఎం చంద్రబాబు సమీక్ష
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సిఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫీిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైన ఆధారపడి ఉంటుందన్నారు. సచివాలయంలో మంగళవారం ఐటి పాలసీపై అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటి సంస్థలు, ఐటి డెవలపర్స్‌కు ఇవ్వాల్సిన ప్రోత్సాహం పైన కూడా ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2029 కల్లా రాష్ట్రంలో 5లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కో వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులివ్వడం, ఐటి సంస్థలకు ఇండిస్టియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళలకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఐఐటిలతో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టిఐహెచ్)కు అనుసంధానంగా ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై సిఎం అధికారులకు సూచనలు చేశారు. సెంటల్ర్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఐదు ప్రాంతాల్లో జోనల్ హబ్‌లకు కేంద్రంగా ”అమరావతి రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్” పనిచేయాలన్నారు. వీటికి దేశంలోని ఐఐటిలను అనుసంధానం చేయాలన్నారు. నెలలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నా రు. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా వర్క్‌స్టేషన్లు ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిం చాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎంతమంది వర్క్‌ఫ్రమ్ హోమ్ కింద పనిచేస్తున్నారో వివరాలు సేకరించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ , అధికారులు పాల్గొన్నారు.
డెవలపర్లకు కేటగిరీల వారీగా రాయితీలు
ఐటి సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది, కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లు, ఐటి క్యాంపస్‌లకు వాటి సీట్ల సామర్ధ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కో వర్కింగ్ స్పేస్‌కు సబ్సిడీ పొందాలంటే వంద సీట్ల సామర్ధ్యం కానీ, 10వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం కానీ ఉండాలి. నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం కలిగిన వెయ్యి చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ తప్పనిసరి. ఐటి క్యాంపస్‌కు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి. రూ.30కోట్ల టర్నోవర్, 100మందికి ఉద్యోగాలు కల్పించే ఐటి సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.