ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇ-క్రాప్ నమోదులో జాప్యాన్ని నివారించాలని, విఆర్‌ఒ, విఎస్‌ను కూడా ఇ-క్రాప్ నమోదుకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. పంట వేసిన ప్రతి రైతు, కౌలు రైతు పొలాల్లోకి వెళ్లి వారి ఫొటోలు తీసి ఇ-క్రాప్ నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ మేరకు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయశాఖ విఎఎలను ఇందుకోసం నియమించిందని, కాని ఫీల్డ్‌లో ఇ-పంట నమోదు సమయంలో యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, మహిళా ఉద్యోగులు ఫీల్డ్‌కు వెళ్లడానికి సరైన సౌకర్యం లేకపోవడం, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ల్యాండ్ డేటా ఇ-పంట యాప్‌లో పూర్తిగా రాకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అంతేకాకుండా యాప్‌లో తక్కువ విస్తీర్ణం చూపిస్తోందని పేర్కొన్నారు. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు, మెట్టలో 250 మీటర్లకు పెంచాలని, లేనిపక్షంలో రైతులు, కౌలు రైతులు ఇ-పంట నమోదుకాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం పూట సర్వర్, యాప్ సరిగ్గా పనిచేసేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని, విఎఎలకు సహాయంగా గతంలో ఇ-పంట ఇకెవైసికి విత్తనాల పంపిణీకి ఎలా ఐతే మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ కార్యదర్శులను కేటాయించారో అదే విధంగా ప్రస్తుతం కూడా వారిని కేటాయించి ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విఆర్‌ఒ, విఎస్‌లు పంట నమోదుకు పూర్తి సహకారం అందించే విధంగా ప్రభుత్వం ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు.
