Delhi liquor case: కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

May 17,2024 08:58 #Delhi liquor case, #MLC Kavitha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సిబిఐ)కి నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సిబిఐ స్పందన కోరింది. లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్‌ 11న సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తరువాత రోజు రౌస్‌ అవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు)లో ప్రొడ్యూస్‌ చేయగా… కోర్టు మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. అనంతరం సిబిఐ కేసులోనూ కోర్టు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కాగా, ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత ట్రయల్‌ కోర్టు ఆశ్రయించగా, స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా కవిత బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో సిబిఐ అరెస్ట్‌, రిమాండ్‌ను… అలాగే ట్రయల్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.

➡️