Delhi Liquor Scam: 8 వేల పేజీలతో కవితపై ఛార్జిషీట్‌

  •  20న పరిశీలిస్తామన్న ట్రయల్‌ కోర్టు
  •  అప్పటి వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎనిమిది వేల పేజీలతో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) రౌస్‌ అవెన్యూ కోర్టుకు తెలిపింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇడి తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌కె మట్ట కోరారు. ఇడి కేసులో గతంలో కవితకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో తీహార్‌ జైలు సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను వర్చువల్‌ మోడ్‌లో ట్రయల్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు మరో 6 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా, సిబిఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఈ నెల 20న పరిశీలిస్తామని ట్రయల్‌ కోర్టు తెలిపింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్‌ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌) దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, చన్ప్రీత్‌ సింగ్‌, ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్లను తాజా ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా ఇడి చేర్చింది.

➡️