ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనసభల పని దినాలు తగ్గితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో ఆయన సోమవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందకుపైగా సభ్యులు ఉన్న చట్ట సభలు ఏడాదిలో కనీసం 75 రోజులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఐదేళ్ల కాలంలో ప్రతియేటా 75 రోజులు చర్చలు జరగడం అవసరమన్నారు. రాజ్యాంగాన్ని వందకంటే అదనంగా సవరించడం ప్రజాస్వామ్య బలానికి సూచనగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగించారు.
