CPM: భవనాల కూల్చివేత సరికాదు

 భూ కేటాయింపులపై సమీక్ష జరపాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : అక్రమ నిర్మాణాల పేరుతో భవనాల కూల్చివేత సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, రాష్ట్రానికి కీడు చేసే భూ అక్రమ కేటాయింపులు, దందాలపై సమీక్షించాలని కోరారు. అవినీతి కుంభకోణాలు జరిగాయని, వాటి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత వైసిపి ప్రభుత్వం మాదిరి కాకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రజానుకూలంగా పాలన సాగించాలని కోరారు. విజయవాడ ఎంబి భవన్‌లో రెండు రోజులపాటు జరిగిన ఎన్‌టిఆర్‌ జిల్లా సిపిఎం కార్యకర్తల శిక్షణా కార్యక్రమం చివరి రోజు ఆదివారం ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని అక్రమ నిర్మాణం పేరుతో అధికారులు శనివారం కూల్చివేశారన్నారు. చట్టబద్ధంగా కూల్చివేస్తే ప్రజలు హర్షిస్తారని, అలా కాకుండా కక్షతో వ్యవహరించారనే దానికి అవకాశం కల్పించే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సిందన్నారు. గతంలో ఇలాగే వైసిపి ప్రభుత్వం వ్యవహరించి అభాసు పాలైందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యల వల్ల కక్ష సాధింపు రాజకీయాలు చేసినట్లు అవుతుందని, అలాంటి ఆస్కారం ఇవ్వొద్దని టిడిపి నాయకత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్‌సి ప్రకటించడం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయడం పట్ల మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన హామీలు నెరవేర్చడానికి, వారు అనుసరించే ప్రజా అనుకూల విధానాలకు సిపిఎం మద్దతు ఇస్తుందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోను, మూడోసారి మోడీ అధికారానికి రావడంలోనూ టిడిపి తోడ్పాటు అందించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న బిజెపికి ఊపిరి పోసిన ఘటన టిడిపిదేనని విమర్శించారు. మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నీట్‌ స్కాంపై విచారణకు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రద్దుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. శాసనసభలో ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైసిపి వ్యవహరించాలని, శాసనసభను బహిష్కరించడం సముచితం కాదని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను శ్రీనివాసరావు వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను అభినందించారు.

➡️