Dengue: డెంగీ డేంజర్‌ బెల్స్‌

Sep 19,2024 09:19 #Dengue Fevers, #Kakinada

జిల్లాలో పెరుగుతున్న కేసులు
ఇప్పటి వరకూ 160 కేసులు నమోదు
అనధికారికంగా వేలల్లో జ్వర పీడితులు
ఆందోళనలో జిల్లా ప్రజలు
ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌ గ్రామానికి చెందిన ఉమ్మిడి కృప(20) డెంగీ జ్వరంతో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందడంతో జిల్లాలో అలజడి రేగుతోంది. డెంగీ జ్వర పీడుతుల్లో ఆందోళన ఎక్కువైంది. ఆగస్టు, సెప్టెంబరుతోపాటు అక్టోబరు నెలల్లో డెంగీ ప్రమాదం పొంచి ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌ కావడంతో ఏ జ్వరమొచ్చినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ జ్వరమైనా ఆసుపత్రులు, రక్త పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

జిల్లాలో 160 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అధికారికంగా 4,600 మందికి ఎలిసా టెస్టులు చేయగా 160 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగష్టు నెలలోనే 1800 పరీక్షలు చేయగా అత్యధికంగా 45 కేసులు వెలుగుచూశాయి. ఈనెల 1 నుంచి 17 వరకూ 1500 మందిని పరీక్షించగా మరో 28 మందికి డెంగీ చోకింది. అలాగే ఇప్పటి వరకు 1.39 లక్షలు టెస్టులు చేయగా 5 మలేరియా కేసులు వెలుగు చూశాయి. సెప్టెంబరులో 11 వేల పరీక్షలు చేశారు. ప్రధానంగా డెంగీ కేసులు ఎన్నడూ లేనివిధంగా అధికంగా నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులు పెరుగుదలతో అటు జిల్లా ప్రజానీకంతోపాటు వైద్యాధికార వర్గాలు కలవరం చెందుతున్నాయి. ఇంకోవైపు ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న వారు వేలల్లోనే ఉంటారని సమాచారం. ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది, సౌకర్యాలు కానరాక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. డెంగీతోపాటు మలేరియా, ఇతర వైరల్‌ ఫీవర్స్‌ వెంటాడుతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

అరకొర చర్యలేనా..?
ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా చెత్త, మురికి గుంటలు దర్శన మిస్తున్నాయి. దీంతో దోమలు దండయాత్రకు మరింత అవకాశం ఏర్పడుతుంది. వాటి వృద్ధి నానాటికీ పెరుగుతూ వస్తోంది. అధికారులు గుర్తించిన హై రిస్క్‌ గ్రామాల్లోనే డెంగీ మరింత వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రాంతాల్లో సరైన చర్యలు తీసుకోకుండా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టులో యు.కొత్తపల్లి, నాగులాపల్లి, పెద్దాపురం మండలం పులిమేరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిని హై రిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించారు. గతంలో పి.మల్లవరం పిహెచ్‌సి పరిధిలోని జి.కొత్తపల్లి, కాకినాడ అర్బన్లో జగన్నాయక్‌పురం, దుమ్ములపేట, వేట్లపాలెం పిహెచ్‌సి పరిధిలో వేమవరం, గొల్లప్రోలులో పాపయ్య చావిడి వీధి, తాళ్లరేవు మండలంలోని పరదేశమ్మ పేట, కాకినాడ రూరల్‌ మండలం తమ్మవరం, యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌, ఎన్‌.సురవరం పిహెచ్‌సి పరిధిలోని కొలిమేరు, తుని పట్టణంలోని ఆర్‌కె.కాలనీ, జగ్గంపేట మండలం రాజపూడి, శంఖవరం మండలంలోని ఎ.మల్లవరం, శాంతి ఆశ్రమం, కోటనందూరు మండలం సంగవాకలను గుర్తించారు. వీటిల్లో జూన్‌ మొదటి వారం నుంచి ఇంటింటికి బృందాలను పంపించి గ్రామంలోని ప్రతీ ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఫ్రైడే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తూ, గుర్తించిన ప్రదేశాల్లో గంబుజా ఫిష్‌ పిల్లలను వదులుతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.50 లక్షల చేప పిల్లల్ని విడుదల చేసినట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. అయితే పారిశుధ్య మెరుగుదలకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.

నిర్ధారణ పరీక్షల్లో జాప్యం…
డెంగీ నిర్ధారణ పరీక్షలు, ఫలితాల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కాకినాడ జిజిహెచ్‌, తుని ఏరియా ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణకు ఏలీసా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సేకరించిన శాంపిల్స్‌ ఈ ప్రాంతాలకు పంపుతున్నారు. కాకినాడ జిజిహెచ్‌లో రోజుకి సుమారు 100, తునిలో 25 పరీక్షలు చేస్తున్నారు. దాంతో జాప్యం అనివార్యమవుతుంది.

ప్రయివేటు ఆస్పత్రులు కిటకిట
డెంగీ కేసులు ఎక్కువగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రయివేటు ఆసుపత్రుల్లో చేసే పరీక్షలను తాము లెక్కల్లోకి తీసుకోవడం లేదని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలో పలు ప్రయివేటు ల్యాబుల్లో డెంగీ పరీక్షలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రాపిడ్‌ టెస్టు కిట్లు ఉపయోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఎలీసా రీడరుతో చేస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబుల్లో చేసే పరీక్షలను ప్రభుత్వ యంత్రాంగం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వాటిల్లో చేసే పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌ వస్తే మరోసారి జిల్లా కేంద్రం కాకినాడ జిజిహెచ్‌లో ల్యాబ్‌కు పంపుతున్నారు. అక్కడ పాజిటివ్‌ వచ్చిన తర్వాతే డెంగీగా నిర్ధారిస్తున్నారు. ఆయా ప్రభుత్వ ల్యాబ్‌ల నుంచి డెంగీ పాజిటివ్‌ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపుతుండగా వాటి ఆధారంగా జిల్లాలో నమోదవుతున్న డెంగీ కేసులను లెక్కకడుతున్నారు.

➡️