డిపాజిట్ల సొమ్ము చెల్లించాల్సిందే!

 కలెక్టరేట్ల వద్ద సహారా బాధితుల ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/ పార్వతీపురం రూరల్‌ : సహారా ఇండియా కంపెనీ ఏజెంట్లకు, ఖాతాదారులకు తక్షణం డిపాజిట్ల సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టరేట్ల వద్ద బాధితులు ధర్నా చేశారు. పార్వతీపురంలో ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి కలెక్టరేట్‌ వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శంకర్రావు, కె.సురేష్‌, ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు మాట్లాడారు. 2009-10లో మొదలైన సహారా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ బాండ్లకు వ్యతిరేకంగా అక్రమ వసూలు చేశారని, వారిపై కేసు నమోదైందని, ఈ మేరకు 2012లో పది శాతం వడ్డీతో కలిపి ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. 2018లో క్యూ షాప్‌ బాండ్స్‌ డబ్బులు ఇస్తామని చెప్పి వాటిని సహారా క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని స్టార్స్‌ మల్టీ పర్పస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి డబ్బులు మళ్లించిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఆర్‌సిఎస్‌ పోర్టల్‌ ద్వారా దేశంలోని ఖాతాదారులకు డబ్బులు చెల్లిస్తామని 2023 జూలై 18న కేంద్ర మంత్రి అమిత్‌ షా చెప్పారని గుర్తు చేశారు. అయితే నేటికీ ఖాతాదారుల అకౌంట్‌లో డబ్బులు వేయలేదని, ప్రభుత్వం స్పందించి ఖాతాదారుల అకౌంట్‌లో సహారా ఇండియా సంస్థ డబ్బులు జమ చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️